
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
భారత తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ క్యాచ్‌ను తీసుకున్న తర్వాత ఈ ఫీట్‌ను రూట్ సాధించాడు. సెకెండ్ స్లిప్‌లో రూట్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రూట్ ఇప్పటివరకు ఔట్ ఫీల్డ్‌లో 211 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(210) పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అటు బ్యాటింగ్‌లోనూ రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో రూట్(104) మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్లు వీరే..
211*జో రూట్
210 రాహుల్ ద్రావిడ్
205 మహేల జయవర్ధనే
200 స్టీవెన్ స్మిత్
200 జాక్వెస్ కాలిస్
196 రికీ పాంటింగ్