కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇద్దరు కీలక పేసర్లను కాదని పవర్ ప్లేలో కెప్టెన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు ఎందుకు బౌలింగ్ చేశాడని ప్రశ్నించాడు.
ఆరు వికెట్ల తేడాతో
అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ విషయంలో యాజమాన్యం వ్యవహారశైలి ఏమిటో తనకు అర్థం కావడం లేదని చిక్కా విమర్శించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నీలో ముంబై బోణీ కొట్టిన విషయం తెలిసిందే. సొంతమైదానం వాంఖడే వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
తద్వారా పద్నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారి.. ఓ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా.. ఆ జట్టు అనుసరించిన వ్యూహాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.
ఇది అసలు అంతుపట్టని విషయం
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది అసలు అంతుపట్టని విషయం. భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఇవ్వలేదు. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం సరికాదు.
అతడొక అద్భుతమైన ఫీల్డర్
అతడొక అద్భుతమైన ఫీల్డర్. సూర్యకు బదులు రూథర్‌ఫర్డ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపాల్సింది. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా పంపి సూర్యకు అన్యాయం చేశారు’’ అని చిక్కా ముంబై యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మరో వ్యూహాత్మక తప్పిదం ఇది
ఇక పవర్ ప్లేలో ముంబై అనుసరించిన వ్యూహాలను ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై చేసిన మరో వ్యూహాత్మక తప్పిదం ఇది. ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నా.. వారి సేవలను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. వారిద్దరు ఆలస్యంగా బంతితో రంగంలోకి దిగారు.
ఇక తన తొలి ఓవర్లోనే బుమ్రా ఐదు స్లో బంతులు ఎందుకు వేశాడో నాకైతే అర్థం కాలేదు. తనదైన సహజశైలిలో స్వింగ్, సీమ కలగలిపి అతడు బౌలింగ్ చేయలేదు. మరోవైపు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు తానే వేశాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు.
కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో బౌల్ట్ నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు.. పాండ్యా 3 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. బుమ్రా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే
ఇదిలా ఉంటే.. సూర్యను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడంతో విమర్శలు రాగా.. హెడ్‌కోచ్ మహేళ జయవర్దనె స్పందించాడు. సూర్య గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నందు వల్లే అతడిని ఎక్కువగా శ్రమపెట్టదలచుకోలేదని తెలిపాడు. ఫిట్‌నెస్ సమస్యలు తీవ్రం కాకుండా చూసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.
చదవండి: అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్!


