అంతుచిక్క‌ని శార్దూల్ ఠాకూర్‌! | IPL 2026: Shardul Thakur Mysterious Ways Bowling Wins MI Vs KKR | Sakshi
Sakshi News home page

అంతుచిక్క‌ని శార్దూల్ ఠాకూర్‌!

Mar 30 2026 11:55 AM | Updated on Mar 30 2026 12:11 PM

IPL 2026: Shardul Thakur Mysterious Ways Bowling Wins MI Vs KKR

శార్దూల్‌ ఠాకూర్‌ (Courtesy: IPL 2026)

శార్దూల్ ఠాకూర్‌.. ఆల్‌రౌండ‌ర్‌గా టీమిండియాకు కొన్ని మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే శార్దూల్ ఒక ఫాస్ట్ బౌల‌ర్ కాదు.. స్వింగ్ బౌల‌ర్ అంత‌క‌న్నా కాదు. అత‌డి బౌలింగ్‌లోనూ పెద్ద‌గా వైవిధ్యత క‌నిపించ‌దు. కానీ జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా వికెట్లు తీస్తూ విజ‌యాల్లో భాగ‌మ‌వుతూ వ‌స్తున్నాడు. 

తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్ట‌డంలో శార్దూల్ ఠాకూర్ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆదివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌)తో జ‌రిగిన మ్యాచ్‌లో స్టార్ బౌల‌ర్ బుమ్రా బౌలింగ్ తేలిపోయిన చోట శార్దూల్ మాత్రం 3 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి కేకేఆర్ భారీ స్కోరు చేయ‌కుండా అడ్డుకొని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు.

అయితే శార్దూల్ ఠాకూర్ టీ20 క్రికెట్‌లో ప‌వ‌ర్ ప్లే, మిడిల్‌, డెత్ ఓవ‌ర్ల‌లో ఎక్క‌డైనా బౌలింగ్ చేయ‌డంలో స‌మ‌ర్థుడు. కేకేఆర్‌తో మ్యాచ్‌ల‌నూ ప‌వ‌ర్ ప్లేలో ఒక‌టి, మిడిల్ ఓవ‌ర్ల‌లో ఒక‌టి, డెత్ ఓవ‌ర్ల‌లో ఒక‌టి ఇలా మూడు వికెట్లు తీశాడు. సాధార‌ణంగా ఒక బౌల‌ర్ వికెట్లు తీస్తూ ఫామ్‌లో ఉన్న‌ట్ల‌యితే అత‌డితో వ‌రుస ఓవ‌ర్లు వేయించి ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌తీయాల‌ని చూస్తారు. కానీ శార్దూల్ మాత్రం తాను ఆడే జ‌ట్టు కెప్టెన్‌కు బౌలింగ్ విష‌య‌మై ముందే క్లారిటీ ఇస్తాడ‌ట‌. 

అందుకే కెప్టెన్ల‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు బౌలింగ్‌కు వ‌చ్చి వికెట్లు తీయ‌డం శార్దూల్‌లో ఉన్న ప్ర‌త్యేక‌త‌. అంతేకాదు శార్దూల్ త‌న బౌలింగ్‌లో ఒకే ర‌కం శైలిని ఎక్కువ‌సార్లు ఉప‌యోగించు. సీమ్‌, పేస్‌ను మిక్స్ చేస్తూ వ‌చ్చే స్లోపేస్ బంతులను ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్లు ఆడేందుకు ఇబ్బంది ప‌డుతుంటారు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ శార్దూల్ దానినే ఫాలో అయ్యాడు. 

అందుకే ఫిన్ అలెన్‌, అజింక్యా ర‌హానే, కామెరూన్ గ్రీన్‌లు ఔటైన విధానం ప‌రిశీలిస్తే శార్దూల్ బౌలింగ్‌పై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఇక 2012 వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్‌కు నెట్‌బౌల‌ర్‌గా ఉన్న శార్దూల్ ఇప్పుడు అదే జ‌ట్టుకు బుమ్రా త‌ర్వాత‌ ప్ర‌ధాన బౌల‌ర్‌గా మారిపోయాడు. 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దూల్ ప‌దేళ్లలో ఆరుజ‌ట్లు మారాడు. 

ప‌దేళ్ల త‌ర్వాత కానీ సొంత జ‌ట్టుకు ఆడే అవ‌కాశం రాలేదు. తాజాగా వ‌చ్చిన అవ‌కాశాన్ని శార్దూల్ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ టీమిండియా త‌ర‌ఫున 13 టెస్టుల్లో 377 ప‌రుగులు, 33 వికెట్లు; 47 వ‌న్డేల్లో 329 ప‌రుగులు, 65 వికెట్లు; 25 టీ20ల్లో 69 ప‌రుగులు సహా 33 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్ కెరీర్‌లో 106 మ్యాచ్‌లాడి 325 ప‌రుగులు చేయ‌డంతో పాటు 110 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

చదవండి: ‘ఆ విషయం క్రికెట్‌ ఆస్ట్రేలియాను అడగండి’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement