జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో తనను విమర్శిస్తున్న వారికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎవరి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో తనకు తెలుసు అన్నాడు. బుమ్రా వికెట్లు తీయకపోతే తనను విమర్శించడం ఏమిటని ప్రశ్నించాడు.
ఐపీఎల్-2026లో ముంబై ప్రధాన పేసర్ బుమ్రా (Jasprit Bumrah) దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల వరకు ఒక్క వికెట్ తీయలేకపోయిన అతడు.. గుజరాత్ టైటాన్స్ (MI vs GT)తో సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం మెరుగ్గా రాణించాడు. తొలి ఓవర్లో రంగంలోకి దిగి గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపాడు.
Guess who’s back? 🔥#JaspritBumrah makes a statement with his first wicket of the season, putting #MI on 🔝#TATAIPL 2026 | #GTvMI | LIVE NOW 👉 https://t.co/EXwHuATomY pic.twitter.com/eQJ9QHheuX
— Star Sports (@StarSportsIndia) April 20, 2026
బుమ్రా తొలి వికెట్.. హార్దిక్‌పై విమర్శలు
తద్వారా ఈ సీజన్‌లో బుమ్రా తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చిన అతడు కీలక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బుమ్రాకు కొత్త బంతిని ఇచ్చి ఆరంభంలో రంగం దించితే ఫలితం ఇలా ఉంటుందని.. కానీ పాండ్యా అతడిని నిర్లక్ష్యం చేస్తూ మూల్యం చెల్లిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బుమ్రా ఎప్పుడూ అంతేగా
ఈ నేపథ్యంలో గుజరాత్‌పై విజయానంతరం హార్దిక్ పాండ్యా ఘాటుగా స్పందించాడు. ‘‘చాలా మంది జస్‌ప్రీత్ బుమ్రాకు తొలి ఓవర్లోనే బంతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది నాకు కూడా ఆసక్తికరంగానే ఉంది.
అయితే, ఇప్పటికి ముంబై తరఫున 151 మ్యాచ్‌లు ఆడితే అందులో ఎనిమిది లేదంటే తొమ్మిదిసార్లు మాత్రమే బుమ్రా తొలి ఓవర్ బౌల్ చేయడం మీరు గమనించాలి.
నా వల్ల ఎలాంటి సమస్యా లేదు
ఇందులో నా వల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు. జస్‌ప్రీత్ ప్రత్యేకమైన బౌలర్. జట్టుకు అవసరమైన వేళ అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. ఈరోజు అతడి సేవలు ఆరంభంలోనే అవసరం అని భావించాము. కొత్త బంతితో ప్రభావం చూపగలడని భావించాము. జట్టులో అతడి కంటే ఉత్తమమైన బౌలర్ ఎవరూ లేరు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
కాగా అహ్మదాబాద్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై గుజరాత్ జట్టును 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 100 పరుగులకే ఆలౌట్ అయి చిత్తుగా ఓడింది. కాగా ఈ సీజన్‌లో ముంబైకి ఆరింట ఇదే రెండో గెలుపు.
చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్


