తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌ | Tilak Varma Reacts On Animated Hardik Pandya Mid Match Message | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

Apr 21 2026 3:31 PM | Updated on Apr 21 2026 4:14 PM

Tilak Varma Reacts On Animated Hardik Pandya Mid Match Message

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ తిలక్‌ వర్మ అదరగొట్టాడు. విధ్వంసకర అజేయ సెంచరీ (45 బంతుల్లో 101)తో రాణించి తమ జట్టుకు విజయం అందించాడు. 

అయితే, అహ్మదాబాద్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో పేలవ ఆరంభం... పవర్‌ప్లేలో సాధారణ స్కోరు... గత మ్యాచ్‌ల తరహాలోనే మరోసారి ముంబై ఇన్నింగ్స్‌ పతనం దిశగా సాగిపోతున్నట్లుగా అనిపించింది... ఇలాంటి స్థితిలో తిలక్‌ వర్మ ఒక్కసారిగా ఆటను మార్చేశాడు.

తీవ్ర ఒత్తిడి మధ్య నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ తొలి సెంచరీతో కదం తొక్కాడు. 19 సీజన్ల ఐపీఎల్‌ చరిత్రలో ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని రీతిలో చివరి 6 ఓవర్లలో ఒక్కడే 82 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. 

అనంతరం ఛేదనలో మొదటి బంతికే వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో తిలక్‌ స్కోరును కూడా అందుకోలేక మూడు వరుస విజయాల తర్వాత ఓటమిని ఆహ్వానించింది.

తిలక్‌ వర్మపై హార్దిక్‌ సీరియస్‌
ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో ఈ మ్యాచ్‌ను కూడా జాగ్రత్తగా మొదలు పెట్టిన తిలక్‌ వర్మ వేగంగా ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డాడు. 14వ ఓవర్‌ ముగిసేసరికి అతను 22 బంతులు ఆడితే చేసింది 19 పరుగులే... ఒక్క బౌండరీ కూడా లేదు!.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎండ్‌లో ఉన్న ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తిలక్‌ వర్మపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది.  

‘‘ఇలా ఆడితే ఎలా? అసలేం ఏం చేస్తున్నావు? ఇలా ఆడితే గెలుపు సాధ్యమేనా?’’ అన్నట్లుగా హార్దిక్‌ బాగా సీరియస్‌ అయినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఎంతో సంయమనం పాటించిన తిలక్‌ వర్మ..  ప్రసిధ్‌ వేసిన 15వ ఓవర్‌తో గేమ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదిన తిలక్‌... రషీద్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు.

దంచికొట్టిన తిలక్‌
ఆ తర్వాత యువ పేస్‌ అశోక్‌ శర్మ ఓవర్లో తిలక్‌ చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ బాది 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను... ఇదే ఓవర్‌ తర్వాతి నాలుగు బంతుల్లో వరుసగా 4, 4, 6, 6తో ఆధిపత్యం ప్రదర్శించాడు. 

19వ ఓవర్‌ ముగిసేసరికి అతను 80 పరుగుల వద్ద ఉన్నాడు. ఐపీఎల్‌లో తిలక్‌ మొదటి సెంచరీ సాధిస్తాడా అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో దూకుడైన బ్యాటింగ్‌తో తిలక్‌ దానిని చేసి చూపించాడు.

ప్రసిధ్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి రెండు బంతుల్లో 4, 6 కొట్టిన అతను ఆఖరి రెండు బంతుల్లో కూడా మళ్లీ 6, 4 బాదాడు. షార్ట్‌ బంతికి స్క్వేర్‌ లెగ్‌ దిశగా బౌండరీకి తరలించడంతో తిలక్‌ శతకం పూర్తయింది. ఒక్క ప్రసిధ్‌ బౌలింగ్‌లోనే అతను 43 పరుగులు రాబట్టాడు. తాను ఆడిన చివరి 23 బంతుల్లో తిలక్‌ ఏకంగా 82 పరుగులు బాదడం విశేషం.

నాలో కసి పెంచేందుకే అలా
ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా తనతో వ్యవహరించిన తీరుపై తిలక్‌ వర్మ తాజాగా స్పందించాడు. ఐపీఎల్‌ వైబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌ భాయ్‌ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరోవైపు.. నేనేమో ప్రశాంతంగా పనిచేసుకుపోయే రకం.

అందుకే భాయ్‌ అప్పుడు నాలో కసిని పెంచాలని అలా చేశాడు. ‘నువ్వు చేయగలవు. నువ్విది చేస్తేనే మనం గెలుస్తాము’ అని నన్ను ఉత్సాహపరిచాడు. అందుకు నేనేమో.. ‘పర్లేదు.. ఇది జరిగితీరుతుంది. జట్టు కోసం చేయగలిగినదంతా చేస్తాను.. కచ్చితంగా చేస్తాను’ అని భాయ్‌కు చెప్పాను’’ అని తిలక్‌ వర్మ పేర్కొన్నాడు. 

కాగా ఐపీఎల్‌-2026లో తొలి ఐదు మ్యాచ్‌లలో తిలక్‌ వర్మ వరుసగా 20, 0, 14, 1, 8 స్కోర్లు చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సమష్టి వైఫల్యంలో భాగంగా ఉన్న తిలక్‌పై కూడా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సెంచరీ ఇన్నింగ్స్‌తో తిలక్‌ బదులిచ్చినట్లు అయింది.

చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

Advertisement
 
Advertisement
Advertisement