టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌ | BCCI Springs Into Action, Initiates Massive Call On Auqib Nabi's India Debut | Sakshi
Sakshi News home page

టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

Apr 21 2026 12:06 PM | Updated on Apr 21 2026 12:20 PM

BCCI Springs Into Action, Initiates Massive Call On Auqib Nabi's India Debut

రాబోయే అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత (జూన్‌లో) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే సిరీస్‌  (టెస్ట్‌, మూడు వన్డేలు) కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అకిబ్‌ నబీని ఎంపిక​ చేయనున్నట్లు తెలుస్తోంది. 

నబీ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నబీ ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించి 60 వికెట్లు తీసి, లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. నబీ సంచలన ప్రదర్శనల కారణంగా జమ్మూ కశ్మీర్‌ తమ తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. నబీ స్థిరమైన వేగంతో పాటు బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సమర్దుడు. 41 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అతను 156 వికెట్లు తీశాడు.

భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా బుమ్రాపైనే పడుతుంది. ఇతర బౌలర్లు కూడా కొంతమేరకు సహకరించినప్పటికీ, స్థిరమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నబీ వంటి యువ బౌలర్ జట్టులోకి వస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బౌలింగ్ విభాగానికి లోతు పెరుగుతుంది.

అందుకే భారత సెలెక్టర్లు నబీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. నబీ బౌలింగ్‌ శైలి సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తుంది. దేశవాలీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఐపీఎల్‌ ఛాన్స్‌ కొట్టేసిన నబీ.. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అతను 2 మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి సెలెక్టర్లు నబీని టెస్ట్‌లకే పరిమితం చేస్తారో లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ అవకాశాలు ఇస్తారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement