
Photo Courtesy: BCCI
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది.
అయితే ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇందులో ముంబై ఇండియన్స్ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉండనుంది.
ఈ నెల 11న ముంబై ఇండియన్స్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.
కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం ఐపీఎల్ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.
స్పందించిన బీసీసీఐ
షెడ్యూల్ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.
మ్యాచ్ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్ సిందూర్ మొదలైంది
ముంబై ఇండియన్స్ -గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల 22వ తేదీన పాక్ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.