
Photo Courtesy: BCCI
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును సమం చేశాడు. నిన్న (మే 6) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ ఓవర్‌లో 11 బంతులు వేసిన ఐదో బౌలర్‌గా హార్దిక్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
హార్దిక్‌కు ముందు సిరాజ్ (2023లో ఆర్సీబీకి ఆడుతూ ముంబై ఇండియన్స్‌పై), తుషార్ దేశ్‌పాండే (2023లో సీఎస్‌కేకు ఆడుతూ లక్నోపై), శార్దూల్ ఠాకూర్ (2025లో లక్నోకు ఆడుతూ కేకేఆర్‌పై), సందీప్ శర్మ (2025లో రాజస్థాన్‌కు ఆడుతూ ఢిల్లీపై) ఈ చెత్త ప్రదర్శన చేశారు. శార్దూల్, సందీప్ శర్మ, హార్దిక్ ఇదే సీజన్‌లో ఈ చెత్త ప్రదర్శన చేయడం విశేషం.
కాగా, తీవ్ర ఉత్కంఠ నడుమ నిన్న మధ్య రాత్రి వరకు సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగుల స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) ఓ మోస్తరుగా రాణించడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ముంబైని కట్టడి చేశారు. సాయి కిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ తీశారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయగా.. గిల్ ఒక్కడే మూడు క్యాచ్‌లు పట్టాడు.
అనంతరం గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులు డిసైడ్ చేశారు. ఛేదనలో తొలుత సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన గుజరాత్.. మధ్యలో ముంబై బౌలర్లు అనూహ్య రీతిలో పుంజుకోవడంతో తడబాటుకు లోనైంది. ఓ దశలో మ్యాచ్ గుజరాత్ చేతుల్లో నుంచి జారిపోయేలా కనిపించింది.
చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. తెవాతియా, కొయెట్జీ బౌండరీ, సిక్సర్ బాది గెలిపించారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ముంబై నాలుగో స్థానానికి దిగజారింది.