
Photo Courtesy: BCCI
ముందుగా అనుకున్నట్లుగా మే 26 తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని ఐపీఎల్-2025 ఆడుతున్న తమ ఆటగాళ్లకు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారికి) క్రికెట్ సౌతాఫ్రికా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మందికి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కింది.
ఈ ఎనిమిది మంది విషయంలోనే క్రికెట్ సౌతాఫ్రికా, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య పేచీ పడేలా ఉంది. సంబంధిత ఫ్రాంచైజీలు క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు జరుపుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు లీగ్ కంటే దేశమే ముఖ్యం కావాలని సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ భావోద్వేగంతో పిలుపునిచ్చాడు. సదరు 8 మంది సౌతాఫ్రికా ప్లేయర్ల నిర్ణయంపై వారి ఫ్రాంచైజీల భవితవ్యం ఆధారపడి ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన 8 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..
కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)
మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)
లుంగి ఎంగిడి (ఆర్సీబీ)
కగిసో రబాడ (గుజరాత్)
ర్యాన్ రికెల్టన్ (ముంబై)
ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)
ఎయిడెన్ మార్క్రమ్ (లక్నో)
వియాన్ ముల్దర్ (ఎస్‌ఆర్‌హెచ్)
పైనున్న ఆటగాళ్లలో ఐదుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్) సంబంధిత ఫ్రాంచైజీలకు ప్లే ఆఫ్స్‌లో కీలకమవుతారు. వీరు అందుబాటులో లేకపోతే వారి జట్ల విజయావకాశాలు ఖచ్చితంగా ప్రభావితమవుతాయి. మిగతా ముగ్గురు (స్టబ్స్, మార్క్రమ్, ముల్దర్) ఆటగాళ్లలో ఒకరి (ముల్దర్) జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. మరో ఇద్దరి (స్టబ్స్, మార్క్రమ్) జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం లైన్‌లో ఉన్నాయి.
క్రికెట్ సౌతాఫ్రికా, బీసీసీఐ మధ్య ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం.. మే 25న ఐపీఎల్ ఫైనల్ ముగిస్తే, ఆ మరుసటి రోజే (మే 26) సౌతాఫ్రికా ఆటగాళ్లంతా స్వదేశానికి బయల్దేరాలి. అనంతరం మే 30న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరాలి. అక్కడు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్‌కు బయల్దేరాలి. ఐపీఎల్ 2025 ముందస్తు షెడ్యూల్ ప్రకారం సౌతాఫ్రికా జట్టు ప్రణాళిక ఇది.
అయితే భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్‌కు (జూన్ 3) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు (జూన్ 11) కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీని వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల వరకు మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక కాని మిగతా సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..
డెవాల్డ్ బ్రెవిస్ (చెన్నై సూపర్ కింగ్స్), ఫాఫ్ డుప్లెసిస్, డోనోవన్ ఫెరీరా (ఢిల్లీ క్యాపిటల్స్), గెరాల్డ్ కోట్జీ (గుజరాత్ టైటాన్స్), క్వింటన్ డికాక్, అన్రిచ్ నోర్ట్జే (కోల్‌కతా నైట్ రైడర్స్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రీట్జ్‌కే (లక్నో), నండ్రే బర్గర్, క్వేనా మఫాకా, డ్రే ప్రిటోరియస్ (రాజస్థాన్ రాయల్స్), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)