
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై సొంత జట్టు అభిమానులే కాక సహచర ఆటగాళ్లు సైతం అసంతృప్తిగా ఉన్నారన్న విషయం మరోసారి బహిర్గతమైంది. దిగ్గజాలు కల్పించుకోవడంతో అభిమానులు కాస్త మెత్తపడినా.. సహచరులు మాత్రం హార్దిక్ తీరును ఎండగడుతూనే ఉన్నారు. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ లాంటి సీనియర్లు గతంలో పలుమార్లు తమ అసంతృప్తిని వెల్లగక్కగా.. తాజాగా మరో సీనియర్ వీరి సరసన చేరాడు.
స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్) నిన్న పంజాబ్‌తో మ్యాచ్ పూర్తయిన అనంతరం తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నబీ అభిమాని పోస్ట్ చేసింది. దాన్నే నబీ తన పోస్ట్‌గా యాడ్ చేశాడు.
ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. మీ కెప్టెన్ (ముంబై ఇండియన్స్) తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేటి మ్యాచ్‌లో నబీ బౌలింగ్ చేయలేదు. అయినా గేమ్ ఛేంజర్ అయిన నబీ కీలక సమయంలో రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్ చేసి ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడని నబీ అభిమాని హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని వెల్లగక్కాడు.
Mohammad Nabi's Instagram story. pic.twitter.com/Rk4qWoIOsl
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024
ఇదే పోస్ట్‌ను నబీ కూడా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి మద్దతు తెలిపాడు. నబీ.. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయటపెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని వ్యక్త పరిచాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ముంబై ఇండియన్స్‌లో చాలామంది సీనియర్ల లాగే నబీ కూడా అసంతృప్తిగా ఉన్నాడంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు నబీకి మద్దతుగా నిలుస్తూ.. హార్దిక్ కెప్టెన్సీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు.
ఈ విషయం పక్కన పెడితే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ ఆఖరి ఓవర్లలో అద్భుతంగా కెప్టెన్సీ చేయడమే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో 19వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చి అప్పటికి కీలకమైన హర్ప్రీత్ బ్రార్ వికెట్ పడగొట్టాడు. ఒకవేళ హార్దిక్ ప్రయోగం (బౌలింగ్ చేయడం) బెడిసికొట్టుంటే అతని మెడపై పెద్ద కత్తి వేలాడేది. అంతిమింగా ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.