IPL 2024: రసెల్‌ సిక్సర్ల సునామీ.. గేల్‌ రికార్డు బద్దలు | IPL 2024 KKR Vs SRH: Andre Russell Became The Fastest To Hit 200 Sixes In IPL, Smashes Gayle Record - Sakshi
Sakshi News home page

IPL 2024 KKR VS SRH: రసెల్‌ సిక్సర్ల సునామీ.. గేల్‌ రికార్డు బద్దలు

Published Sun, Mar 24 2024 1:32 PM

IPL 2024 KKR VS SRH: Andre Russell Became The Fastest To Hit 200 Sixes In IPL - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్సర్లు)  సృష్టించిన రసెల్‌.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు ఈ రికార్డు క్రిస్‌ గేల్‌ (1811 బంతుల్లో) పేరిట ఉండేది.

రసెల్‌, గేల్‌ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్‌ పోలార్డ్‌కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్‌-3 ఆటగాళ్లు విండీస్‌ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు గేల్‌ (357), రోహిత్‌ శర్మ (257), ఏబీ డివిలియర్స్‌ (251), ధోని (239), విరాట్‌ కోహ్లి (235), వార్నర్‌ (228), పోలార్డ్‌ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. 

కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రసెల్‌ బ్యాటింగ్‌ విన్యాసాలకు హర్షిత్‌ రాణా అద్భుతమైన బౌలింగ్‌ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్‌ చిరస్మరణీయ విజయం సాధించింది.

భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్‌ వికెట్‌తో పాటు షాబాజ్‌ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికే క్లాసెన్‌ సిక్సర్‌ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్‌ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సాల్ట్‌ (54), రసెల్‌ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్‌ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్‌ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. 


 

Advertisement
Advertisement