IPL 2023 Auction: ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురవడం ఖాయం..!

IPL 2023 Auction: T20 World Cup Stars On Whom IPL Franchises May Show Interest - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరిగే ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం  ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్‌ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. 

మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌), సామ్‌ కర్రన్‌ (ఇంగ్లండ్‌), కెమరూన్‌ గ్రీన్‌ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్‌ (ఐర్లాండ్‌), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌), సికందర్‌ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్‌ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్‌కప్‌-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌, ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్‌, ఫిలిప్‌ సాల్ట్‌, ఆదిల్‌ రషీద్‌, కేశవ్‌ మహారాజ్‌ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. 

అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్‌ స్టోక్స్‌ కోసం కనీసం 12 కోట్లు, సామ్‌ కర్రన్‌ కోసం 10 కోట్లు, కెమరూన్‌ గ్రీన్‌ కోసం 8 కోట్లు, ఐర్లాండ్‌ పేసర్‌ జాషువ లిటిల్‌ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్‌ హేల్స్‌, సికందర్‌ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్‌లు వేసుకున్నట్లు సమాచారం.

అలాగే లిటన్‌ దాస్‌, హ్యారీ బ్రూక్‌, ఫిలిప్‌ సాల్ట్‌, ఆదిల్‌ రషీద్‌, కేశవ్‌ మహారాజ్‌లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్‌ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్‌ చేసిన ఆటగాళ్లలో జేసన్‌ రాయ్‌, కేఎస్‌ భరత్‌, రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, జేమ్స్‌ నీషమ్‌, డేనియల్‌ సామ్స్‌, ఎవిన్‌ లూయిస్‌, జేసన్‌ హోల్డర్‌, మనీశ్‌ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది.  
చదవండి: స్టార్‌ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్‌ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top