Virat Kohli: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న రికార్డులు 

IPL 2022 RCB VS KKR: Virat Kohli, Shreyas Iyer, Rahane Eye Big Records - Sakshi

RCB VS KKR: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 30) కేకేఆర్‌తో జరుగనున్న హైఓల్టేజీ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్‌ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి (212) మరో మూడు సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్‌ పోలార్డ్‌  (214)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకుతాడు. 

అలాగే కోహ్లి ఈ మ్యాచ్‌లో మరో మూడు ఫోర్లు కొడితే ఐపీఎల్‌లో 550 బౌండరీలు సాధించిన క్రికెటర్ల క్లబ్‌లో చేరతాడు. ఈ రెండు రికార్డులతో పాటు కోహ్లి మరో రికార్డుకు చేరువకానున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 42 హాఫ్‌ సెంచరీలు సాధించిన కోహ్లి.. లీగ్‌ చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన డేవిడ్‌ వార్నర్‌ (49), శిఖర్‌ ధవన్‌ (44) రికార్డులకు సమీపిస్తాడు. 

ఇక ఇదే మ్యాచ్‌లో కోహ్లితో పాటు కేకేఆర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, శ్రేయస్‌ అయ్యర్‌లను కూడా పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఐపీఎల్‌లో 3985 పరుగులు చేసిన రహానే.. ఆర్సీబీతో మ్యాచ్‌లో మరో 15 పరుగులు చేస్తే 4000 పరుగుల క్లబ్‌లో చేరిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. అలాగే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఐదో ప్లేయర్‌గా గుర్తింపు సాధిస్తాడు. కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. ఆర్సీబీతో మ్యాచ్‌లో అయ్యర్‌ (198) మరో రెండు ఫోర్లు కొడితే 200 బౌండరీల మార్కును చేరుకుంటాడు. అలాగే అయ్యర్‌ (2395) మరో 5 పరుగులు సాధిస్తే.. 2400 పరుగుల మార్క్‌ను రీచ్‌ అవుతాడు. 
చదవండి: IPL 2022: జోరుమీదున్న కేకేఆర్‌ను ఆర్సీబీ నిలువరించేనా..?

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top