IPL 2022 Qualifier 2: రాజస్తాన్‌ రైట్‌ రైట్‌...

IPL 2022 Qualifier 2: Rajasthan Royals beat Royal Challengers Bangalore by 7 wickets - Sakshi

14 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌

క్వాలిఫయర్‌–2లో 7 వికెట్లతో బెంగళూరుపై ఘన విజయం

సెంచరీతో చెలరేగిన జోస్‌ బట్లర్‌

రేపు గుజరాత్‌ తో టైటిల్‌ పోరు

ఐపీఎల్‌ మొదటి సీజన్‌–2008లో విజేతగా నిలిచిన తర్వాత పడుతూ, లేస్తూ ప్రస్థానం సాగించి... మధ్యలో రెండేళ్లు నిషేధానికి కూడా గురైన రాజస్తాన్‌ రాయల్స్‌ 14 ఏళ్ల తర్వాత మళ్లీ తుది పోరుకు అర్హత సాధించింది. గత మూడు సీజన్లుగా చివరి రెండు స్థానాల్లోనే నిలుస్తూ వచ్చిన ఈ టీమ్‌ ఈసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచింది.

తొలి క్వాలిఫయర్‌లో ఓడినా... తమ తప్పులు దిద్దుకొని రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. ప్రసిధ్, మెక్‌కాయ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన రాజస్తాన్‌ ఆ తర్వాత బట్లర్‌ మెరుపు సెంచరీతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మరోవైపు కొంత అదృష్టం కూడా కలి సొచ్చి ఇక్కడి వరకు వచ్చిన ఆర్‌సీబీ నాకౌట్‌ మ్యాచ్‌లో ఓడి నిష్క్రమించింది. టైటిల్‌ లేకుండానే ఆ జట్టు 15వ సీజన్‌నూ నిరాశగా ముగించింది.

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌–2022 ఫైనల్లో టాప్‌–2 జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు ‘రాయల్స్‌’ జట్ల మధ్య జరిగిన పోరులో చివరకు రాజస్తాన్‌దే పైచేయి అయింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది.

రజత్‌ పటిదార్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌ లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌ (60 బంతుల్లో 106 నాటౌ ట్‌; 10 ఫోర్లు, 6 సిక్స్‌ లు) సీజన్‌లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. రేపు ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ తలపడుతుంది.  

పటిదార్‌ మినహా...
కోహ్లి (7) మరోసారి నిరాశపరుస్తూ తొందరగా అవుట్‌ కావడంతో ఆర్‌సీబీకి సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్‌ హీరో పటిదార్‌ కొన్ని చక్కటి షాట్లతో దూకుడు ప్రదర్శించగా, కెప్టెన్‌ డుప్లెసిస్‌ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) అతనికి సహకరించాడు. 13 పరుగుల వద్ద పరాగ్‌ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్‌ ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు.

పటిదార్‌తో రెండో వికెట్‌కు 70 పరుగులు (53 బంతుల్లో) జోడించిన అనంతరం డుప్లెసిస్‌ అవుట్‌ కాగా, మ్యాక్స్‌వెల్‌ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) జోరును ప్రదర్శించాడు. చహల్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో 40 బంతుల్లో పటిదార్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్‌ చేసిన రాజస్తాన్‌ పట్టు బిగించింది.  

మెరుపు బ్యాటింగ్‌తో...
ఛేదనలో రాజస్తాన్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. సిరాజ్‌ వేసిన తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్‌ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) 16 పరుగులు రాబట్టడంతో రాయల్స్‌ జోరుగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. సిరాజ్‌ తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టిన బట్లర్, షహబాజ్‌ ఓవర్లోనూ 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో చెలరేగాడు. తొలి వికెట్‌కు 31 బంతుల్లోనే 61 పరుగులు వచ్చాక యశస్వి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సామ్సన్‌ (21 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా కీలక పరుగులు సాధించాడు. బట్లర్‌ మాత్రం ఎక్కడా తగ్గకుండా దూకుడును కొనసాగించడంతో రాజస్తాన్‌ పని మరింత సులువైంది. 66 పరుగుల వద్ద బట్లర్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దినేశ్‌ కార్తీక్‌ వదిలేయడం కూడా బెంగళూరు ఆశలను ముగించింది.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) సామ్సన్‌ (బి) ప్రసిధ్‌ 7; డుప్లెసిస్‌ (సి) అశ్విన్‌ (బి) మెక్‌కాయ్‌ 25; పటిదార్‌ (సి) బట్లర్‌ (బి) అశ్విన్‌ 58; మ్యాక్స్‌వెల్‌ (సి) మెక్‌కాయ్‌ (బి) బౌల్ట్‌ 24; లోమ్రోర్‌ (సి) అశ్విన్‌ (బి) మెక్‌కాయ్‌ 8; కార్తీక్‌ (సి) పరాగ్‌ (బి) ప్రసిధ్‌ 6; షహబాజ్‌ (నాటౌట్‌) 12; హసరంగ (బి) ప్రసిధ్‌ 0; హర్షల్‌ (బి) మెక్‌కాయ్‌ 1; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1–9, 2–79, 3–111, 4–130, 5–141, 6–146, 7–146, 8–154.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–28–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–22–3, మెక్‌కాయ్‌ 4–0–23–3, అశ్విన్‌ 4–0–31–1, చహల్‌ 4–0–45–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) కోహ్లి (బి) హాజల్‌వుడ్‌ 21; బట్లర్‌ (నాటౌట్‌) 106; సామ్సన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) హసరంగ 23; పడిక్కల్‌ (సి) కార్తీక్‌ (బి) హాజల్‌వుడ్‌ 9; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1–61, 2–113, 3–148.
బౌలింగ్‌: సిరాజ్‌ 2–0–31–0, హాజల్‌వుడ్‌ 4–0–23–2, మ్యాక్స్‌వెల్‌ 3–0–17–0, షహబాజ్‌ అహ్మద్‌ 2–0–35–0, హర్షల్‌ పటేల్‌ 3.1–0–29–0, హసరంగ 4–0–26–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top