ముంబై వర్సెస్ ఢిల్లీ.. ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే..!

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (మే 21) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసే ఈ బిగ్ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఢిల్లీ ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరాలని పట్టుదలగా ఉండగా.. సీజన్‌ను గెలుపుతో ముగించాలని ముంబై ఆతృతగా ఉంది.
ఇరు జట్లకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ-ముంబై జట్లు 31 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా..16 మ్యాచ్‌ల్లో ముంబై, 15 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందాయి. నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇలా ఉన్నాయి..
- నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో బౌండరీ బాదితే శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి తర్వాత టీ20ల్లో 900 బౌండరీల మార్కును అందుకున్న మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
- ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 20 పరుగులు చేస్తే ముంబై ఇండియన్స్ తరఫున టీ20ల్లో 5000 పరుగులు పూర్తి చేస్తాడు. అలాగే రోహిత్ మరో 9 ఫోర్లు బాదితే ముంబై తరఫున 450 బౌండరీల మార్కును అందుకుంటాడు.
- ముంబై ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ మరో సిక్సర్ బాదితే టీ20ల్లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. సామ్స్ నేటి మ్యాచ్‌లో మరో వికెట్ పడగొడితే పొట్టి క్రికెట్‌లో 100 వికెట్ల మార్కును అందుకుంటాడు.
- ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ నేటి మ్యాచ్‌లో మరో రెండు వికెట్లు సాధిస్తే.. ఐపీఎల్‌లో 50 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో వేగంగా 50 వికెట్ల (34 మ్యాచ్‌ల్లో) మైలురాయిని చేరుకున్న భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
- ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో మూడు బౌండరీలు కొడితే సెహ్వాగ్, పంత్, ధవన్ తర్వాత ఢిల్లీ తరఫున 200 బౌండరీలు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.
- మిచెల్ మార్ష్ మరో 6 బౌండరీలు బాదితే టీ20ల్లో 250 బౌండరీల మార్కును చేరుకుంటాడు. అలాగే మార్ష్ మరో 8 పరుగులు సాధిస్తే పొట్టి క్రికెట్‌లో 3500 పరుగులను పూర్తి చేసుకుంటాడు.
- పృథ్వీ షా మరో 10 బౌండరీలు సాధిస్తే ఐపీఎల్‌లో 200 బౌండరీలు పూర్తి చేసుకుంటాడు.
- ముస్తాఫిజుర్ రెహ్మాన్ మరో వికెట్ పడగొడితే టీ20ల్లో 250 వికెట్ల మార్కును అలాగే 4 వికెట్ల తీస్తే ఐపీఎల్‌లో 50 వికెట్ల మార్కును చేరుకుంటాడు.
చదవండి: 'ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది'
మరిన్ని వార్తలు