IPL 2022 Mega Auction: ఈరోజు బ్రేకింగ్‌ న్యూస్‌ ఇదే.. దుమ్ము లేపిన ఇషాన్‌ కిషన్‌.. రికార్డు ధర!

IPL 2022 Mega Auction: Ishan Kishan Sold For 15 25 Crore - Sakshi

IPL 2022 Mega Auction- Ishan Kishan: ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. కాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు), స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)ను రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా ఇషాన్‌ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే, మెగా వేలంలో మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. హైదరాబాద్‌తో పోటీ పడి రికార్డు ధరకు అతడిని కొనుగోలు చేసింది. ఇక ఫిబ్రవరి 12 నాటి తొలి రోజు వేలంలో భాగంగా అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడు ఇషాన్‌ కావడం విశేషం. అంతకు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 12. 25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

ఇక గత సీజన్‌లో ఆశించిన మేరకు ఆకట్టుకోనప్పటికీ ఇషాన్‌కు ఈ మేర ముంబై భారీ మొత్తం చెల్లించడం గమనార్హం. కాగా ఇషాన్‌కు స్వాగతం పలుకుతూ ముంబై ఇండియన్స్‌ చేసిన ట్వీట్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘ఈరోజు బ్రేకింగ్‌ న్యూస్‌ ఇదే. ఇషాన్‌ కిషన్‌ తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు’’ అంటూ ట్విటర్‌ వేదికగా వెల్‌కమ్‌ చెప్పింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడు ఇషాన్‌ కిషన్‌. అతడి కంటే ముందు వరుసలో క్రిస్‌ మోరిస్‌(16 కోట్లు), యువరాజ్‌ సింగ్‌, ప్యాట్‌ కమిన్స్‌ ఉన్నారు. 

చదవండి: David Warner: భారీ ధరకు అమ్ముడుపోతాడనుకుంటే ఇదేం ట్విస్టు!
IPL 2022 Auction: వేలంలో షాకింగ్‌ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top