
సాయికిషోర్, రషీద్ ఖాన్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గిల్
పుణే: పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరు... ఎవరిది పైచేయి అవుతుందో తేల్చే మ్యాచ్‌లో హోరాహోరీ సమరంపై ఆసక్తి... ముందుగా గుజరాత్ 144 పరుగులకే పరిమితమైంది. దాంతో మ్యాచ్ ఏకపక్షమని, లక్నో సూపర్ జెయింట్స్ విజయం ఖాయమని అనిపించింది. నిజంగానే మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. కానీ ఊహించిన ఫలితం మాత్రం తారుమారైంది. చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో సత్తా చాటిన టైటాన్స్ జట్టు సూపర్ జెయింట్స్‌ను మరో 37 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూల్చింది.
2022 ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ పోరులో టైటాన్స్ 62 పరుగులతో లక్నోను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. దీపక్ హుడా (26 బంతుల్లో 27; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రషీద్ ఖాన్ (4/24) కీలక వికెట్లతో చెలరేగాడు.
హార్దిక్ విఫలం
ఒకవైపు శుబ్‌మన్... మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్లు! టైటాన్స్ ఇన్నింగ్స్ మొత్తం ఇలాగే సాగింది. అయితే చివరి వరకు అజేయంగా నిలిచినా శుబ్‌మన్ కూడా వేగంగా ఆడలేకపోగా... మిగతావారూ ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ సాధారణ స్కోరు నమోదు చేసింది. లక్నో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పవర్‌ప్లే ముగిసేసరికి 35 పరుగులే చేసిన జట్టు సాహా (11 బంతుల్లో 5; 1 ఫోర్), వేడ్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 11) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లలో స్కోరు 59/3 వద్ద నిలిచింది. డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు శుబ్‌మన్‌కు అండగా నిలిచినా, అతను కూడా దూకుడు ప్రదర్శించలేదు. వీరిద్దరు 41 బంతుల్లో 52 పరుగులు జోడించగా, 42 బంతుల్లో శుబ్‌మన్ అర్ధ సెంచరీ పూర్తయింది. 18, 19 ఓవర్లలో కలిపి 11 పరుగులే రాగా... హోల్డర్ వేసిన చివరి ఓవర్లో రాహుల్ తెవాటియా (16 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మూడు ఫోర్లు బాదడంతో మొత్తం 16 పరుగులు లభించాయి.
టపటపా...
ఛేదనలో లక్నో ఘోరంగా విఫలమైంది. ఐదు పరుగుల వ్యవధిలో డికాక్ (10 బంతుల్లో 11; 1 సిక్స్), కెప్టెన్ కేఎల్ రాహుల్ (16 బంతుల్లో 8; 1 ఫోర్) వికెట్లు కోల్పోయిన తర్వాత ఆ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగినట్లు అనిపించలేదు. ఒకరితో పోటీ పడి మరొకరు వేగంగా పెవిలియన్ చేరారు. విజయం కోసం 55 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన స్థితిలో ఏడో స్థానంలో స్టొయినిస్ (2) క్రీజ్‌లోకి రాగా, అతని రనౌట్‌తో లక్నో ఆశలకు పూర్తిగా తెరపడింది.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) అవేశ్ (బి) మొహసిన్ 5; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 63; వేడ్ (సి) డికాక్ (బి) అవేశ్ 10; హార్దిక్ (సి) డికాక్ (బి) అవేశ్ 11; మిల్లర్ (సి) బదోని (బి) హోల్డర్ 26; తెవాటియా (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 144.
వికెట్ల పతనం: 1–8, 2–24, 3–51, 4–103.
బౌలింగ్: మొహసిన్ 4–0–18–1, చమీరా 4–0–34–0, అవేశ్ 4–0–26–2, కృనాల్ 4–0–24–0, హోల్డర్ 4–0–41–1.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సాయికిషోర్ (బి) యష్ దయాళ్ 11; రాహుల్ (సి) సాహా (బి) షమీ 8; హుడా (సి) షమీ (బి) రషీద్ 27; కరణ్ శర్మ (సి) మిల్లర్ (బి) యష్ 4; కృనాల్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ 5; బదోని (స్టంప్డ్) సాహా (బి) కిషోర్ 8; స్టొయినిస్ (రనౌట్) 2; హోల్డర్ (ఎల్బీ) (బి) రషీద్ 1; మొహసిన్ (సి) రషీద్ (బి) కిషోర్ 1; చమీరా (నాటౌట్) 0; అవేశ్ (సి) సాహా (బి) రషీద్ 12; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో ఆలౌట్) 82.
వికెట్ల పతనం: 1–19, 2–24, 3–33, 4–45, 5–61, 6–65, 7–67, 8–70, 9–70, 10–82.
బౌలింగ్: షమీ 3–0–5–1, హార్దిక్ 1–0–8–0, యష్ దయాళ్ 2–0–24–2, జోసెఫ్ 2–0–14–0, రషీద్ 3.5–0–24–4, సాయికిషోర్ 2–0–7–2.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ క్యాపిటల్స్ X రాజస్తాన్ రాయల్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.