IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడలేదు.. అయినా కోటికి పైగా వెనకేశారు! టైటిల్స్‌ కూడా!

IPL 2022: 3 Players Earned More Than 1 Crore Rs Without Playing Single Match - Sakshi

IPL 2022: కొంతమంది ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మరికొంత మంది ఒక్కసారి తమ ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. అదృష్టం వెంటపడి మరీ వరిస్తుంది. అలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా కనకవర్షం కురిపిస్తుంది. ఇక ఐపీఎల్‌ వంటి క్యాష్‌ రిచ్‌లీగ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం సహజమే! కొన్ని ఫ్రాంఛైజీలు వేలంలో కోట్లు పోసి కొన్న క్రికెటర్లను కూడా బెంచ్‌కే పరిమితం చేసే పరిస్థితులు ఉంటాయి.

జట్టు అత్యుత్తమ కూర్పులో భాగంగా కొందరిని పక్కనపెడతాయి. అయినా సరే వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించక తప్పదు కదా! అలా ఐపీఎల్‌-2022లో బెంచ్‌కే పరిమితమై కోటి రూపాయలకు పైగా సంపాదించిన టాప్‌-3 క్రికెటర్లను పరిశీలిద్దాం! వీరిలో ఇద్దరు ఆడకుండానే టైటిల్‌ గెలిచిన జట్టులో భాగం కావడం విశేషం.

1.జయంత్‌ యాదవ్‌
ఐపీఎల్‌ మెగా వేలం-2022లో టీమిండియా ఆల్‌రౌండర్‌ జయంత్‌ యాదవ్‌ను 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గుజరాత్‌ టైటాన్స్‌. కనీస ధర కోటితో ఆక్షన్‌లోకి వచ్చిన అతడిని లక్నో సూపర్‌ జెయింట్స్‌తో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. 

రషీద్‌ ఖాన్‌తో కలిసి అతడిని బరిలోకి దింపుతారనే అంచనాలు ఉన్నా.. అలా జరుగలేదు. సీజన్‌ ఆసాంతం ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జయంత్‌కు ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు లభించలేదు. రషీద్‌, సాయి కిషోర్‌, రాహుల్‌ తెవాటియాలతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ఇక ఐపీఎల్‌-2022తో ఎంట్రీ ఇచ్చిన సీజన్‌లోనే గుజరాత్‌ చాంపియన్స్‌గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

2. డొమినిక్‌ డ్రేక్స్‌
ఐపీఎల్‌లో అత్యంత అదృష్టవంతుడైన ప్లేయర్‌గా కరేబియన్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్‌ డ్రేక్స్‌ పేరొందాడు. కనీసం ఒక్కసారైనా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టైటిల్‌ గెలిచిన జట్టులో భాగమవ్వాలని ప్రతి ఒక్క ఆటగాడి కల. డొమినిక్‌ డ్రేక్స్‌కు ఇది రెండుసార్లు నెరవేరింది. అది కూడా ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే.

గత సీజన్‌ రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని కొనుగోలు చేసింది. ఇక ఆ 2021 ఎడిషన్‌లో చెన్నై టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022 మెగావేలంలో ఆర్సీబీతో పోటీ పడి మరీ గుజరాత్‌ టైటాన్స్‌ డొమినిక్‌ను దక్కించుకుంది.

ఇందుకోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు బెంచ్‌కే పరిమితమైనా కోటితో పాటు మరో ఐపీఎల్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

3. రాజ్‌వర్ధన్‌ హంగర్కర్‌
భారత అండర్‌-19 జట్టులో సభ్యుడైన రాజ్‌వర్ధన్‌.. వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీఎస్‌కే ఈ యువ ఆల్‌రౌండర్‌ను 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ.. తుదిజట్టులో చోటు కల్పించలేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల.. జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్‌ చేయగల రాజ్‌వర్ధన్‌కు అవకాశం ఇవ్వలేదు.  

చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్‌.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్‌లో ఆడతా: ప్రొటిస్‌ కెప్టెన్‌
Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్‌-డి ప్లేయర్‌'.. టీమిండియా మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top