మా ఓటమికి అదే కారణం: రోహిత్‌

IPL 2021: We Should Have Batted Better In The Middle Overs, Rohit - Sakshi

చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలవడంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరాశ వ్యక్తం చేశాడు. మిడిల్‌ ఓవర్లలో సరిగా బ్యాటింగ్‌ చేయలేకపోవడంతోనే ఓటమి చెందామన్నాడు. మంచి ఆరంభం వచ్చిన తర్వాత దాన్ని అందిపుచ్చుకోలేకపోయామన్నాడు. తమ సామర్థ్యం మేరకు ఆడక పోవడం వల్లే తక్కువ స్కోరును నమోదు చేశామన్నాడు  ఒక బ్యాటింగ్‌ యూనిట్‌గా దీన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రోహిత్‌ వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ అంతా ఢిల్లీ బౌలర్లదేనని, చాలా క్లిష్టంగా బౌలింగ్‌ చేసి తమ వికెట్లను రాబట్టారన్నాడు. ఇక్కడ డ్యూ ఉంటుందని తెలుసని, బంతిపై గ్రిప్‌ దొరకనంతగా ఏమీ లేదన్నాడు. ఈ విషయం గత కొన్ని మ్యాచ్‌ల నుంచి చూస్తున్నామని,  ఢిల్లీతో మ్యాచ్‌లో డ్యూ అనేది ఇక్కడ ప్రభావం చూపిందని అనుకోవడం లేదన్నాడు. గెలవాలంటే ఒక మంచి క్రికెట్‌ ఆడాలని, అది ఢిల్లీతో మ్యాచ్‌లో చేయలేకపోయామన్నాడు. 

ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ శిఖర్‌ ధవన్‌ మాట్లాడుతూ.. ‘ఇది వాంఖడే స్టేడియానికి పూర్తి భిన్నంగా ఉంది. చెన్నైలో గెలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ముంబై వంటి జట్టుపై గెలవడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ విజయంతో మా కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ బాగా పెరుగుతాయి. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాలనుకున్నాం. మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే వరకూ క్రీజ్‌లో నిలబడ లేకపోడంతో నిరాశ చెందా. కానీ మ్యాచ్ విజయంతో ముగించాం. ఈ మ్యాచ్‌లో విజయానికి మేము అన్ని విధాల అర్హులం’ అని పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top