DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు?

IPL 2021: KKR to face Delhi Capitals In Second Qualifier At Sharjah - Sakshi

నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య రెండో క్వాలిఫయర్‌

ఆత్మవిశ్వాసంతో మోర్గాన్‌ బృందం

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

షార్జా: వరుసగా ఈ సీజన్‌లో కూడా ఫైనల్‌ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇదే ఆఖరి అవకాశం. ధోని సేనపై సాధించలేకపోయిన విజయాన్ని ఇప్పుడు మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తప్పనిసరిగా సాధించాలి. అయితే లీగ్‌ చివరి దశ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్‌లో పుంజుకున్న కోల్‌కతా అంత ఆషామాషీ ప్రత్యర్థి కాదిపుడు. ఇంకా చెప్పాలంటే మరో సూపర్‌కింగ్స్‌లాంటి జట్టుతో మళ్లీ తలపడటమే ఈ రెండో క్వాలిఫయర్‌! ఇప్పుడు నైట్‌రైడర్స్‌ను ఓడిస్తేనే ఢిల్లీ టైటిల్‌ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంటుంది.

లేదంటే 2019 సీజన్‌లాగే మూడో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిషభ్‌ పంత్‌ సేన సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా మూడో టైటిల్‌పై కన్నేసింది. ఇప్పటికే రెండుసార్లు విజేత అయిన ఈ మాజీ చాంపియన్‌ ఈ సీజన్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే అనుకున్నది సాధిస్తుంది.  

టాపార్డర్‌దే బాధ్యత 
క్యాపిటల్స్‌ గత మ్యాచ్‌లో చేసిన స్కోరు పటిష్టమైందే. కానీ టాపార్డర్‌లో పృథ్వీ షా ఒక్కడే మెరిశాడు. అనుభవజ్ఞుడైన ధావన్‌ (7), శ్రేయస్‌ అయ్యర్‌ (1) ఇద్దరు కలిసి కనీసం 10 పరుగులైనా చేయలేకపోయారు. ఇప్పుడు రెండో క్వాలిఫయర్‌ రూపంలో ఇద్దరికీ మరో అవకాశం వచ్చింది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బాధ్యతను పంచుకుంటే మిడిలార్డర్‌లో కెప్టెన్‌ రిషభ్‌ పంత్, హెట్‌మైర్‌ ధనాధన్‌ మెరుపులతో స్కోరు అమాంతం పెంచేయగలరు.

గత మ్యాచ్‌లో తడబడిన టాపార్డర్‌కు చికిత్స చేసింది కూడా పంత్, హెట్‌మైర్లే! ప్రమాదకారిగా మారిన కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ను ఎదుర్కోవడంపై పాంటింగ్‌ కోచింగ్‌ బృందం కసరత్తు చేయాలి. లేదంటే బెంగళూరులాగే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్‌ విభాగంలో నోర్జే, రబడ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నారు. టామ్‌ కరన్, సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్, అక్షర్‌ పటేల్‌లు కూడా కోల్‌కతాను కట్టడి చేస్తే ఢిల్లీ ఫైనల్‌ చేరుకోవచ్చు.

జోరుమీదున్న కోల్‌కతా  
లీగ్‌లో తన కిందున్న ముంబైకి ఏమాత్రం చాన్స్‌ ఇవ్వకుండా ఎలిమినేటర్‌ చేరుకున్న నైట్‌రైడర్స్‌ అక్కడ తనకంటే మెరుగైన బెంగళూరును ఇంటిదారి పట్టించింది. ఇప్పుడు ఏకంగా లీగ్‌ టాపర్‌ను ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లలో శుబ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌ చక్కని ఆరంభాలిస్తున్నారు. నితీశ్‌ రాణా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అనుభవజ్ఞులైన దినేశ్‌ కార్తీక్, కెప్టెన్‌ మోర్గాన్, షకీబ్‌లు కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడితే నైట్‌రైడర్స్‌కు తిరుగుండదు.

గత మ్యాచ్‌లో నరైన్‌ ఆల్‌రౌండ్‌ షో హైలైట్‌. మేటి హిట్టర్లను నిలదొక్కుకునే లోపే పడగొట్టేసిన నరైన్‌ బ్యాటింగ్‌లో ఒకే ఓవర్లో చేసిన విధ్వంసం కోల్‌కతాను గెలుపుబాట పట్టించింది. సీమర్‌ ఫెర్గూసన్‌ ఎప్పట్లాగే తన మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. యూఏఈ అంచె లీగ్‌లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీకి చెక్‌ పెట్టిన జట్టు కోల్‌కతానే! ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.

జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ధావన్, శ్రేయస్, హెట్‌మైర్, అక్షర్‌ పటేల్, టామ్‌ కరన్, అశ్విన్, రబడ, అవేశ్‌ ఖాన్, నోర్జే. 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), గిల్, వెంకటేశ్‌ అయ్యర్, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, దినేశ్‌ కార్తీక్, నరైన్, షకీబ్, ఫెర్గూసన్, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top