IND VS NZ T20 Series: టీమిండియాకు భారీ షాక్‌.. గాయం కారణంగా స్టార్‌ ఓపెనర్‌ ఔట్‌

Injury Rules Ruturaj Gaikwad Out Of New Zealand T20Is - Sakshi

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మణికట్లు గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (జనవరి 26) అధికారికంగా ప్రకటించింది. రుతురాజ్‌ను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిపోర్ట్‌ చేయాలని సూచించినట్లు బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు.

రుతురాజ్‌ స్థానాన్ని మరే ఇతర ఆటగాడితో భర్తీ చేసేది లేదని సదరు అధికారి పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా పృథ్వీ షా జట్టులో ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు తీర్మానించి ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, రుతురాజ్‌ (మహారాష్ట్ర) ఇటీవల హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌ సందర్భంగా గాయపడినట్లు సమాచారం. అతడు మణికట్టు గాయం బారిన పడటం ఇటీవలికాలంలో ఇది రెండోసారి. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ నుంచి కూడా రుతురాజ్‌ మణికట్టు గాయం కారణంగానే తప్పుకున్నాడు. 

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ జనవరి 27 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. రాంచీ వేదికగా రేపు భారత్‌-కివీస్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తాజాగా ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన జోష్‌లో టీమిండియా ఉండగా.. టీ20 సిరీస్‌నైనా కైవసం‍ చేసుకోవాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది. గాయం కారణంగా ఈ సిరీస్‌ నుంచి రుతురాజ్‌ తప్పుకోవడంతో టీమిండియా ఓపెనర్లుగా శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుం‍దర్‌, శివమ్‌ మావీ, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వేంద్ర చహల్‌, ముకేశ్‌ కుమార్‌

న్యూజిలాండ్‌ జట్టు..
మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారల్‌ మిచెల్‌, మైఖేల్‌ రిప్పన్‌, మార్క్‌ చాప్‌మన్‌, ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, డేన్‌ క్లీవర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, జాకబ్‌ డఫ్ఫీ, బెన్‌ లిస్టర్‌, ఐష్‌ సోధీ, లోకీ ఫెర్గూసన్‌, హెన్రీ షిప్లే, బ్లెయిర్‌ టిక్నర్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top