
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. యువ డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు.
గాయం కారణంగా చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న పేసర్ రేణుకా ఠాకూర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకుంది. తేజల్ హసబ్నిస్ , ప్రేమ రావల్, ప్రియా మిశ్రా, ఉమా చెత్రీ, మిన్నూ మణి, సయాలీ సత్ఘరే స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
వరల్డ్‌కప్ టోర్నీ సెప్టెంబర్ 30న మొదలవుతుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. అక్టోబర్ 5న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అక్టోబర్ 9న భారత్ సౌతాఫ్రికాతో తలపడుతుంది. అక్టోబర్ 12న ఆస్ట్రేలియా, అక్టోబర్ 19న ఇంగ్లండ్, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడాల్సి ఉంది.
వన్డే ప్రపంచకప్-2025 కోసం భారత మహిళల క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్
మెగా టోర్నీకి ముందు భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే సెప్టెంబర్ 14న, రెండో వన్డే 17న, మూడో వన్డే సెప్టెంబర్ 20న జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఒక్క మార్పు మినహా వరల్డ్‌కప్‌కు ప్రకటించిన జట్టునే కొనసాగించనున్నారు. ఆసీస్ సిరీస్‌లో అమన్‌జోత్ స్థానంలో సయాలీ సత్ఘరే ఆడనుంది.