భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం

Indian wrestlers make last attempt to qualify for Tokyo Olympics - Sakshi

నేటి నుంచి వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ

సోఫియా (బల్గేరియా): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు చివరి ప్రయత్నం చేయనున్నారు. నేటి నుంచి బల్గేరియా రాజధాని సోఫియాలో జరగనున్న వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో మొత్తం 12 బెర్త్‌ల కోసం భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్‌... మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగాలలో 84 దేశాల నుంచి 400 మందికిపైగా రెజ్లర్లు 18 వెయిట్‌ కేటగిరీలలో బరిలోకి దిగనున్నారు. ప్రతి వెయిట్‌ కేటగిరీలో ఫైనల్‌కు చేరిన ఇద్దరు రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఖరారవుతాయి.  

► తొలి రోజు పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో 57, 65, 74, 86, 97, 125 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. ఇప్పటికే భారత్‌ నుంచి ఫ్రీస్టయిల్‌ విభాగంలో రవి (57 కేజీలు), బజరంగ్‌ పూనియా (65 కేజీలు), దీపక్‌ పూనియా (86 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు.  

► చివరి క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత్‌ నుంచి ఫ్రీస్టయిల్‌లో మిగిలిన మూడు బెర్త్‌ల కోసం అమిత్‌ ధన్‌కర్‌ (74 కేజీలు), సత్యవర్త్‌ కడియాన్‌ (97 కేజీలు), సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) పోటీపడనున్నారు.  

► పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో ఆరు వెయిట్‌ కేటగిరీలలో ఇప్పటి వరకు భారత్‌ నుంచి ఒక్కరు కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సచిన్‌ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (77 కేజీలు), సునీల్‌ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్‌ (130 కేజీలు) బరిలో ఉన్నారు.

► మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌ నుంచి వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఆఖరి క్వాలిఫయింగ్‌ టోర్నీలో సీమా బిస్లా (50 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) రేసులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top