
మహిళల టి20 మ్యాచ్‌లో అరుదైన ఫీట్
ఖతార్‌పై యూఏఈ ఘనవిజయం
బ్యాంకాక్: మహిళల టి20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో అరుదైన ఫీట్ నమోదైంది. బ్యాంకాక్ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూఏఈకి చెందిన 10 మంది ప్లేయర్లు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. మహిళల, పురుషుల క్రికెట్‌లో కలిపి ఒక జట్టులో ఇద్దరికి మించి ఎక్కువ మంది ఆటగాళ్లు రిటైర్డ్ అవుట్ కావడం ఇదే తొలిసారి. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 16 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్, కెపె్టన్ ఈషా ఓజా (55 బంతుల్లో 113; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు), తీర్థ సతీశ్ (42 బంతుల్లో 74; 11 ఫోర్లు) దంచి కొట్టారు.
ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 16 ఓవర్లలోనే 192 పరుగులు జోడించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో డిక్లరేషన్ సౌలభ్యం లేకపోవడంతో... వీరిద్దరితో పాటు మిగిలిన ప్లేయర్లంతా రిటైర్డ్ అవుట్‌గా ప్రకటించుకొని ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. లక్ష్యఛేదనకు దిగిన ఖతార్ 11.1 ఓవర్లలో 29 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఏఈ జట్టు 163 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఓపెనర్ రిజ్పా బానో ఇమ్మాన్యూయేల్ (20; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 8 మంది ప్లేయర్లు డకౌటయ్యారు. దీంతో ఇరు జట్లలో కలిపి 15 మంది ప్లేయర్లు డకౌటయ్యారు. మహిళల టి20 క్రికెట్‌లో ఇదే అత్యధికం. యూఏఈ బౌలర్లలో మిచెల్ బోథా 3, కేటీ థామ్సన్ 2 వికెట్లు పడగొట్టారు.