పరాజయంతో ప్రారంభం

Indian womens team lost in the first T20 match - Sakshi

తొలి టి20 మ్యాచ్‌లో ఓడిన భారత మహిళల జట్టు

38 పరుగులతో నెగ్గిన ఇంగ్లండ్‌

మెరిసిన వైట్, నాట్‌ సివర్‌

 షఫాలీ అర్ధ సెంచరీ వృథా

ముంబై: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్‌ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బుధవారం వాంఖెడె మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయింది. హీతెర్‌ నైట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ ఈ గెలుపుతో సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌ ఇదే వేదికపై శనివారం జరుగుతుంది.

టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. రేణుక సింగ్‌ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో సోఫీ డంక్లీ, అలీస్‌ క్యాప్సీలను అవుట్‌ చేసింది. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్‌ను డానియల్‌ వైట్‌ (47 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నాట్‌ సివర్‌ బ్రంట్‌ (53 బంతుల్లో 77; 13 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి అర్ధ సెంచరీలతో అదరగొట్టారు.

మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో రేణుక సింగ్‌ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి ఓడిపోయింది. షఫాలీ వర్మ (42 బంతుల్లో 52; 9 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకిల్‌స్టోన్‌ (3/15) భారత్‌ను కట్టడి చేసింది.   

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సోఫియా డంక్లీ (బి) రేణుక సింగ్‌ 1; డానియల్‌ వైట్‌ (స్టంప్డ్‌) రిచా ఘోష్‌ (బి) సైకా ఇషాక్‌ 75; అలీస్‌ క్యాప్సీ (బి) రేణుక సింగ్‌ 0; నాట్‌ సివర్‌ బ్రంట్‌ (సి) రిచా ఘోష్‌ (బి) రేణుక సింగ్‌ 77; హీతెర్‌ నైట్‌ (బి) శ్రేయాంక పాటిల్‌ 6; అమీ జోన్స్‌ (సి) జెమీమా (బి) శ్రేయాంక పాటిల్‌ 23; ఫ్రెయా కెంప్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–140, 4–165, 5–177, 6–197. బౌలింగ్‌: రేణుక 4–0–27–3, పూజ 4–0–44–0, సైకా ఇషాక్‌ 4–0–38–1, దీప్తి శర్మ 3–0–28–0, శ్రేయాంక 4–0–44–2, కనిక అహుజా 1–0–12–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (సి) సారా గ్లెన్‌ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్‌ 52; స్మృతి మంధాన (బి) నాట్‌ సివర్‌ బ్రంట్‌ 6; జెమీమా రోడ్రిగ్స్‌ (సి) అమీ జోన్స్‌ (బి) ఫ్రెయా కెంప్‌ 4; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్‌ 26; రిచా ఘోష్‌ (సి) అలీస్‌ క్యాప్సీ (బి) సారా గ్లెన్‌ 21; కనిక అహుజా (సి) నాట్‌ సివర్‌ బ్రంట్‌ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్‌ 15; పూజ వస్త్రకర్‌ (నాటౌట్‌) 11; దీప్తి శర్మ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–20, 2–41, 3–82, 4–122, 5–134, 6–151.  బౌలింగ్‌: మహికా గౌర్‌ 2–0–18–0, లారెన్‌ బెల్‌ 4–0–35–0, నాట్‌ సివర్‌ బ్రంట్‌ 4–0–35–1, ఫ్రెయా కెంప్‌ 2–0–30–1, సోఫీ ఎకిల్‌స్టోన్‌ 4–0–15–3, సారా గ్లెన్‌ 4–0–25–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top