అదరగొట్టిన అభిషేక్‌ | India beat New Zealand by 48 runs in first T20 | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన అభిషేక్‌

Jan 22 2026 3:21 AM | Updated on Jan 22 2026 4:20 AM

India beat New Zealand by 48 runs in first T20

తొలి టి20లో భారత్‌ ఘనవిజయం

48 పరుగులతో న్యూజిలాండ్‌ ఓటమి

అభిషేక్‌ శర్మ 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 84

రేపు రాయ్‌పూర్‌లో రెండో టి20

ఎప్పటిలాగే తనదైన శైలిలో అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌... సూర్యకుమార్, రింకూ సింగ్‌ దూకుడు... ఆపై బౌలర్ల ప్రతాపం... వెరసి న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ముందుగా కేవలం బౌండరీల ద్వారానే 168 పరుగులు రాబట్టి భారీ స్కోరుతో చెలరేగిన టీమిండియా... అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమైంది. కివీస్‌ కొంత పోరాడినా లక్ష్యానికి దూరంలో నిలిచిపోయింది. 

నాగ్‌పూర్‌: న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్‌ టి20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో నెగ్గి 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత్‌ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (35 బంతుల్లో 84; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల వర్షం కురిపించగా... రింకూ సింగ్‌ (20 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌ ) ధాటిగా ఆడారు. అభిషేక్, సూర్యకుమార్‌ మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు. 

అనంతరం న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్‌ చాప్‌మన్‌ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రెండో టి20 శుక్రవారం రాయ్‌పూర్‌లో జరుగుతుంది.  

సమష్టి ప్రదర్శన 
14 సిక్సర్లతో 84 పరుగులు... 21 ఫోర్లతో 84 పరుగులు... భారత్‌ జోరు బౌండరీలతో ఈ తరహాలో సాగింది. ముందుగా అభిషేక్, మధ్యలో సూర్య, పాండ్యా, చివర్లో రింకూ చెలరేగి భారత్‌కు భారీ స్కోరును అందించారు. టాస్‌ ఓడిన భారత్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. సంజు సామ్సన్‌ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు) ఆరంభంలోనే వెనుదిరిగినా... మరోవైపు అభిషేక్‌ సిక్స్‌తో దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. 

జేమీసన్, క్లార్క్‌ వేసిన వరుస ఓవర్లలో అతను రెండేసి సిక్స్‌లు బాదాడు. దాంతో పవర్‌ప్లేలో భారత్‌ 68 పరుగులు చేసింది. ఫిలిప్స్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్‌ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సోధి ఓవర్లో సూర్య వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 117కు చేరింది. సూర్య అవుటైన తర్వాత హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అదే ధాటిని ప్రదర్శించాడు. 

సోధి ఓవర్లో వరుసగా 4, 6, 6 బాది సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అదే ఓవర్‌ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్‌ వెనుదిరిగాడు. తక్కువ వ్యవధిలో శివమ్‌ దూబే (4 బంతుల్లో 9; 1 సిక్స్‌), పాండ్యా, అక్షర్‌ పటేల్‌ (5) అవుటైన తర్వాత ఆఖర్లో రింకూ చెలరేగిపోయాడు. క్లార్క్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి స్కోరును 200 దాటించిన అతను... మిచెల్‌ వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి.  

ఫిలిప్స్‌ అర్ధ సెంచరీ 
న్యూజిలాండ్‌ ఛేదన పేలవంగా ప్రారంభమైంది. రెండో బంతికే కాన్వే (0) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రచిన్‌ (1) కూడా అవుటయ్యాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన రాబిన్సన్‌ (21) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. ఇలాంటి స్థితిలో ఫిలిప్స్, చాప్‌మన్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఫిలిప్స్‌ 29 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. 

ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు భారీ సిక్స్‌లు బాదాడు. అక్షర్‌ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి ఫిలిప్స్‌ అవుట్‌ కావడంతో 79 పరుగుల (42 బంతుల్లో) నాలుగో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో చాప్‌మన్‌ను వరుణ్‌ అవుట్‌ చేయడంతో కివీస్‌ ఆశలు కోల్పోయింది. 

ఈ దశలో విజయానికి చివరి 5 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సిన జట్టు చివరకు 46 పరుగులే చేయగలిగింది. డరైల్‌ మిచెల్‌ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు), సాంట్నర్‌ (13 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) రచిన్‌ (బి) జేమీసన్‌ 10; అభిషేక్‌ (సి) జేమీసన్‌ (బి) సోధి 84; ఇషాన్‌ కిషన్‌ (సి) చాప్‌మన్‌ (బి) డఫీ 8; సూర్యకుమార్‌ (సి) రాబిన్సన్‌ (బి) సాంట్నర్‌ 32; పాండ్యా (సి) చాప్‌మన్‌ (బి) డఫీ 25; దూబే (సి అండ్‌ బి) జేమీసన్‌ 9; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 44; అక్షర్‌ (సి) మిచెల్‌ (బి) క్లార్క్‌ 5; అర్ష్ దీప్ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–126, 4–149, 5–166, 6–185, 7–209. బౌలింగ్‌: డఫీ 4–0–27–2, జేమీసన్‌ 4–0–54–2, క్లార్క్‌ 4–0–40–1, సోధి 3–0–38–1, ఫిలిప్స్‌ 1–0–20–0, సాంట్నర్‌ 3–0–37–1, మిచెల్‌ 1–0–21–0.  

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) సామ్సన్‌ (బి) అర్ష్ దీప్ 0; రాబిన్సన్‌ (సి) అభిషేక్‌ (బి) పాండ్యా 1; రచిన్‌ (సి) అభిషేక్‌ (బి) పాండ్యా 1; ఫిలిప్స్‌ (సి) దూబే (బి) అక్షర్‌ 78; చాప్‌మన్‌ (సి) అభిషేక్‌ (బి) వరుణ్‌ 39; మిచెల్‌ (సి) (సబ్‌) బిష్ణోయ్‌ (బి) దూబే 28; సాంట్నర్‌ (నాటౌట్‌) 20; క్లార్క్‌ (సి) రింకూ (బి) దూబే 0; జేమీసన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–52, 4–131, 5–143, 6–189, 7–189.  బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–31–1, పాండ్యా 2–0–20–1, బుమ్రా 3–0–29–0, అక్షర్‌ పటేల్‌ 3.3–0–42–1, వరుణ్‌ 4–0–37–2, దూబే 3–0–28–2, అభిషేక్‌ 0.3–0–3–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement