మన మహిళలు ఫైనల్‌కు...

Indian team won against Japan - Sakshi

జపాన్‌పై గెలిచిన భారత బృందం 

నేడు థాయ్‌లాండ్‌తో అమీతుమీ 

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌  

షా ఆలమ్‌ (మలేసియా): భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు చాంపియన్‌ అయిన జపాన్‌ను కంగు తినిపించి తొలి సారి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్‌ 3–2 స్కోరుతో మాజీ చాంపియన్‌ జపాన్‌పై ఆఖరి మ్యాచ్‌ దాకా పోరాడి గెలిచింది. రెండు ఒలింపిక్స్‌ పతకాల విజేత  సింధు సింగిల్స్, డబుల్స్‌ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా... మిగతా సహచరులెవరూ కుంగిపోకుండా జపాన్‌ ప్రత్యర్థులపై అసాధారణ విజయాలు సాధించారు.

నేడు జరిగే టైటిల్‌ పోరులో భారత్‌... థాయ్‌లాండ్‌తో తలపడుతుంది.  జోరు మీదున్న సింధుకు తొలి సింగిల్స్‌లో నిరాశ ఎదురైంది. ఆమె 13–21, 20–22తో అయ ఒహొరి చేతిలో పరాజయం చవిచూసింది. డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–17, 16–21, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకు నమి మత్సుయమ–చిహరు షిద జంటను ఊహించని రీతిలో కంగు తినిపించింది. దీంతో ఇరు జట్ల స్కోరు 1–1తో సమం కాగా.. రెండో సింగిల్స్‌లో ప్రపంచ 53వ ర్యాంకర్‌ అష్మిత 21–17, 21–14తో 20వ ర్యాంకర్‌ ఒకుహరపై సంచలన విజయం సాధించింది.

దీంతో భారత్‌ ఆధిక్యం 2–1కు చేరింది. తనీషా క్రాస్టో గాయం వల్ల సింధు తప్పనిసరి పరిస్థితుల్లో అశ్విని పొన్నప్పతో కలిసి డబుల్స్‌ మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. కానీ ఈ ద్వయం 14–21, 11–21తో ప్రపంచ 11వ ర్యాంకు జంట రెనా మియవుర–అయాకొ సకురమొతో చేతిలో ఓడిపోయింది. మరో సారి ఇరుజట్లు 2–2తో సమవుజ్జీగా నిలువగా... నిర్ణాయక ఆఖరి సింగిల్స్‌ ఉత్కంఠ పెంచింది. ఇందులో అన్‌మోల్‌ ఖర్బ్‌ 21–14, 21–18తో నత్సుకి నిదయిరపై గెలుపొందడంతో భారత్‌ ఫైనల్‌ చేరింది. 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top