పాక్‌పై గెలిచి ఫైనల్లోకి భారత్‌ | Indian team reaches finals of Asia Cup Under 18 Hockey tournament | Sakshi
Sakshi News home page

పాక్‌పై గెలిచి ఫైనల్లోకి భారత్‌

Jun 6 2026 3:47 AM | Updated on Jun 6 2026 3:48 AM

Indian team reaches finals of Asia Cup Under 18 Hockey tournament

నాలుగు గోల్స్‌తో మెరిసిన ఆశిష్‌

కాకమిగహారా (జపాన్‌): ఆసియా కప్‌ అండర్‌–18 హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత జట్టు 5–3 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్‌ జట్టుతో టీమిండియా తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో జపాన్‌ 8–1 గోల్స్‌ తేడాతో మలేసియా జట్టును ఓడించింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున పుర్తి ఆశిష్‌ తాని (12వ, 49వ, 53వ, 56వ, నిమిషాల్లో) నాలుగు గోల్స్‌ చేయగా... షారుఖ్‌ అలీ (35వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. 

పాక్‌ జట్టు తరఫున ఆదిల్‌ (27వ నిమిషంలో), అస్లమ్‌ మొహమ్మద్‌ ఫర్హాన్‌ (37వ నిమిషంలో), ఉజేర్‌ అహ్మద్‌ ఖురేషి (42వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. భారత్‌కు లభించిన ఆరు పెనాల్టీ కార్నర్‌లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను కూడా గోల్‌గా మలిచింది. పాక్‌ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్‌లు రాగా ఒక దాంట్లో సఫలమైంది. 

ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది. చైనా జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘షూటౌట్‌’లో 1–3 తేడాతో ఓటమి పాలైంది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత మహిళల జట్టు ఆడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement