అందరికీ నెగెటివ్‌

Indian squad negative in COVID-19 tests - Sakshi

కరోనా నిర్ధారణ పరీక్షలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు పాస్‌

మూడో టెస్టు కోసం సిడ్నీ చేరిన జట్లు

మెల్‌బోర్న్‌: హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్‌–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. ‘ఆటగాళ్లతో పాటు జట్టు సహాయ సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆదివారం వీరందరికీ ‘ఆర్టీ–పీసీఆర్‌’ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా... సోమవారం ఫలితాలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి’ అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్, రిషభ్‌ పంత్, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాలు కరోనా నిబంధనల్ని ఉల్లంఘించారని, బయో బబుల్‌ దాటి బయటకొచ్చి రెస్టారెంట్‌ రుచులు చూశారని గగ్గోలు పెట్టిన ఆసీస్‌ ప్రభుత్వ వర్గాలు ఇక తమ నోటికి తాళం వేసుకుంటాయేమో! ఎందుకంటే ఇప్పటికే ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి సీఏ ఉమ్మడి దర్యాప్తు చేపడుతుందంటూ చేసిన ప్రకటనలకు ఇక కాలం చెల్లినట్లే! రెస్టారెంట్‌లో భోంచేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచినప్పటికీ సోమవారం జట్టుతో పాటే సిడ్నీకి చేరుకున్నారు. తాజాగా రిపోర్టులు కూడా నెగెటివ్‌గా రావడంతో ఇప్పుడు అంతా కలిసే ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటారు.  

25 శాతం మంది వీక్షకులకే ప్రవేశం
సిడ్నీలో నమోదవుతున్న కరోనా కేసుల దృష్ట్యా మూడో టెస్టుకు వచ్చే వీక్షకుల సంఖ్యను 25 శాతానికి కుదించారు. ఈ మైదానం మొత్తం సామర్థ్యం 38 వేల సీట్లు. దీంతో పదివేల లోపే ప్రేక్షకుల్ని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో టెస్టు కోసం ఇది వరకే జారీ చేసిన టికెట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేసి అంతా కొత్తగా అంటే సీటుకు, సీటుకు మధ్య భౌతిక దూరం వుండేలా తిరిగి జారీ చేస్తారు. దీనిపై సీఏ తాత్కాలిక సీఈఓ నిక్‌ హాక్లీ మాట్లాడుతూ ‘న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలోని ప్రజారోగ్యం దృష్ట్యా మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మూడో టెస్టు సజావుగా, సురక్షితంగా జరిగేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. ప్రేక్షకుల సంఖ్యను కుదిస్తాం’ అని అన్నారు.

ఎలా‘గబ్బా’!
భారత ఆటగాళ్ల రెస్టారెంట్‌ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈనెల 15 నుంచి జరగాల్సిన నాలుగో టెస్టుపైనే సందిగ్ధత పూర్తిగా తొలగలేదు. కాస్త అయోమయం ఉన్నప్పటికీ బీసీసీఐ సోమవారం చేసిన ప్రకటన సీఏకు ఊరటనిచ్చింది. ‘షెడ్యూల్‌ ప్రకారమే నాలుగో టెస్టు జరుగుతుంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే నిబంధనలు పాటిస్తేనే బ్రిస్బేన్‌కు రావాలని లేదంటే అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు రాస్‌ బేట్స్‌ వ్యాఖ్యలపై బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top