అపురూపంగా అక్కున చేర్చుకొని... | Indian Cricketers Celebrate Champions Trophy 2025 Win, Photos Viral | Sakshi
Sakshi News home page

అపురూపంగా అక్కున చేర్చుకొని...

Mar 11 2025 4:05 AM | Updated on Mar 11 2025 11:12 AM

Indian cricketers celebrate Champions Trophy

భారత క్రికెటర్ల ‘చాంపియన్స్‌’ సంబరాలు   

దుబాయ్‌: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల చేతుల్లో నాలుగో ఐసీసీ టైటిల్స్‌...రవీంద్ర జడేజాకు ముచ్చటగా మూడోది. గిల్, పంత్, పాండ్యా, అక్షర్, అర్‌‡్షదీప్‌ సింగ్, కుల్దీప్‌ ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ ట్రోఫీని అందుకోగా... షమీ, అయ్యర్, రాహుల్, సుందర్, రాణా మొదటిసారి కప్‌ను ముద్దాడారు... 15 మంది సభ్యుల జట్టులో అందరి ఘనతలు వేర్వేరు కావచ్చు... కానీ ఇప్పటికే ఎన్ని గెలిచినా, ఏం సాధించినా మరో విజయం దక్కినప్పుడు అందరిలో కనిపించే ఆనందం ఒక్కటే... సంబరాల్లో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. 

ఆదివారం చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు ఆటగాళ్ల వేడుకల్లో ఇది స్పష్టంగా కనిపించింది. జడేజా బౌండరీ కొట్టి ఛేదన పూర్తి చేయడంతో మొదలైన జోష్‌ సోమవారం వరకు సాగింది. స్టేడియంలో ఒకవైపు జట్టు సహచరులతో విజయాన్ని పంచుకుంటూనే మరోవైపు రోహిత్, కోహ్లి, జడేజా, షమీ, గిల్‌ తమ కుటుంబ సభ్యులతో ట్రోఫీ ఆనందాన్ని ప్రదర్శిస్తూ సుదీర్ఘ సమయం గడిపారు. అక్కడి నుంచి ఇదే ఉత్సాహం డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ కొనసాగింది. 

ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేక్‌ను కెప్టెన్‌ రోహిత్‌ కట్‌ చేసిన తర్వాత తమ విజయానుభూతిని అంతా పంచుకున్నారు. అనంతరం హోటల్‌ చేరుకున్న భారత బృందానికి ఘన స్వాగతం లభించింది. మ్యాచ్‌ గెలిచిన తర్వాత కుల్దీప్‌ చెప్పినట్లు రాత్రంతా పార్టీ కొనసాగింది. గిల్, పాండ్యా, వరుణ్‌ హోటల్‌ గదుల్లోనే చాంపియన్స్‌ ట్రోఫీతో ఫోటోలకు పోజులిస్తూ ఈ మధుర క్షణాలను చిరస్మరణీయం చేసుకున్నారు. సోమవారం ఉదయం విజేత కెప్టెన్‌తో ఐసీసీ ప్రత్యేక ఫొటో షూట్‌ కార్యక్రమం జరిగింది. 

ముందుగా ఐసీసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా టోర్నీ జ్ఞాపికలుగా మ్యాచ్‌లలో ఉపయోగించిన బంతులు, స్టంప్స్‌పై రోహిత్‌ శర్మ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత  ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫా నేపథ్యంగా జరిగిన షూట్‌లో ట్రోఫీతో భారత సారథి సగర్వంగా నిలిచాడు. గత ఏడాది రోహిత్‌ నాయకత్వంలోనే గెలుచుకున్న టి20 వరల్డ్‌ కప్‌ను కూడా చాంపియన్స్‌ ట్రోఫీతో కలిపి ప్రదర్శించడం విశేషం.  

స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లు
చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచి సంబరాలు ముగించిన వెంటనే టీమిండియా స్వదేశం పయనమైంది. సోమవారం రాత్రికే జట్టు ఆటగాళ్లంతా భారత్‌కు చేరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement