
ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత మహిళల జట్టు మొదట సన్నాహకంగా ఈసీబీ డెవలప్‌మెంట్ టీమ్‌తో రెండు మ్యాచ్‌లాడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ హర్మన్‌ప్రీత్ బృందం ఓడింది. అయితే అసలైన సిరీస్ మొదలుకాగానే అమ్మాయిల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా ఓడిన జట్టే... ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌ల్ని గెలిచింది.
ఇక ‘హ్యాట్రిక్’తో ఇంకో రెండు మ్యాచ్‌లుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ గడ్డపై అమ్మాయిలు సాధించే తొలి టి20 సిరీస్ కానుంది. మరోవైపు సొంతగడ్డపై వరుస పరాభవాల భారం ఒత్తిడి పెంచగా... తాజాగా అనుభవజ్ఞురాలైన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ గాయంతో కీలకమైన మూడో మ్యాచ్‌కు దూరమైంది.
ఇది ఆతిథ్య జట్టుకు మరింత ప్రతికూలమవగా... సిరీస్‌ను గెలిచేందుకు భారత్‌కు అనుకూలతనీయనుంది. రెగ్యులర్ కెపె్టన్ గైర్హాజరీతో టామీ బ్యూమౌంట్ జట్టును నడిపించనుంది. బ్రంట్ స్థానంలో మైయా బౌచియెర్‌ను ఎంపిక చేశారు.
జోరుమీదున్న భారత్
విజయాలిచ్చి ఉత్సాహం, బ్యాటర్ల ఫామ్‌తో భారత అమ్మాయిల జట్టు జోరుమీదుంది. తొలి మ్యాచ్‌లో స్మృతి మంధాన చెలరేగితే... గత మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్ బ్యాటింగ్ బాధ్యతను పంచుకున్నారు. రిచా ఘోష్ కూడా మెరుపులు మెరిపించింది. వీరితో పాటు షఫాలీ వర్మ, దీప్తి శర్మలు కూడా ఫామ్‌లో ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. బౌలింగ్‌లో తెలుగమ్మాయి శ్రీచరణి నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేస్తోంది.
తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన ఆంధ్ర స్పిన్నర్, రెండో మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచింది. దీప్తి శర్మ, అమన్‌జోత్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి కూడా బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇన్ని సానుకూలాంశాల మధ్య మూడో విజయం సాధించడం హర్మన్‌ప్రీత్ బృందానికి ఏమంత కష్టం కానేకాదు. అన్నింటికి మించి ఆల్‌రౌండ్ సత్తాతో ఆతిథ్య జట్టును చిత్తు చేస్తున్న తీరు వచ్చే ఏడాది ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్‌కు ఎంతగానో దోహదం చేసే అవకాశాలున్నాయి.
గెలిస్తేనే నిలిచేది!
వరుస వైఫల్యాలకు తోడు రెగ్యులర్ కెపె్టన్ బ్రంట్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమవడం ఇంగ్లండ్‌ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతోంది. పర్యాటక బ్యాటర్లేమో చెలరేగుతుంటే... సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే దశలో ఒత్తిడిని తట్టుకొని ఏ మేరకు నెట్టుకురాగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. తొలి టి20లో ఆడిన బ్రంట్ అందుబాటులో లేదు. రెండు మ్యాచ్‌లో బ్యూమౌంట్ రాణించింది. వీరిద్దరు మినహా ఇంకెవరూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. మూడో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బౌలర్లదే పైచేయి అయితే మాత్రం మాంచెస్టర్ (నాలుగో మ్యాచ్ వేదిక) వెళ్లకముందే ఇక్కడే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.
తుది జట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, అమన్‌జోత్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతి, స్నేహ్ రాణా, శ్రీచరణి.
ఇంగ్లండ్: టామీ బ్యూమౌంట్ (కెప్టెన్), సోఫియా, డానీ వ్యాట్, మైయా బౌచియెర్, అమీ జోన్స్, అలైస్ క్యాప్సీ, అర్లాట్, సోఫీ ఎకిల్‌స్టోన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్, లిన్సే స్మిత్.