మహిళల వన్డే ప్రపంచకప్-2025లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ముంబై వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మూడో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని హర్మన్ సేన భావిస్తోంది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్ నాటి ఫలితాన్నే రిపీట్ చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
మరోవైపు ఆసీస్ అమ్మాయిలు మాత్రం రికార్డు స్దాయిలో పదో సారి ఫైనల్‌కు చేరాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటికే లీగ్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్ బ్యాటింగ్‌లో సత్తాచాటినప్పటికి బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది.
భారత్‌కు బిగ్ షాక్.. ఆసీస్‌కు జోష్
సెమీఫైనల్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగింది. దీంతో ఆమె స్దానంలో విధ్వంసకర బ్యాటర్ షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి వచ్చింది. ఛాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన షెఫాలీ ఎలా రాణిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ అలీసా హీలీ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించింది. దీంతో భారత్‌తో జరగనున్న సెమీఫైనల్లో ఆమె ఆడడం దాదాపు ఖాయమైంది. హీలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. లీగ్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె భారీ శతకం(142)తో చెలరేగింది.

బలంగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్
భారత్‌తో పోలిస్తే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో పరుగులు సాధించే సత్తా ఉన్న ప్లేయర్లు ఆసీస్ జట్టులో ఉన్నారు. అలీసా హీలీ, బెత్ మూనీ, మెక్‌గ్రాత్, గార్డెనర్, పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా కంగారులు బలంగా ఉన్నారు. మెగాన్ షూట్, అలానా కింగ్, గార్డెనర్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఆసీస్ వద్ద ఉన్నారు.

స్మృతి చెలరేగుతుందా?
ఇక ఆసీస్‌తో సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపైనే ఉన్నాయి. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న మంధాన కీలకమైన సెమీస్‌లో ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీ ఆరంభంలో తడబడిన మంధాన.. ఆ తర్వాత మాత్రం సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
ఇప్పటివరకు ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన మంధాన, 60.8 సగటుతో 365 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, రెండు ఆర్ధ శతకాలు ఉన్నాయి. ఆసీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 80 పరుగులతో సత్తాచాటింది. ఇప్పుడు నాకౌట్ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ మంధానకు ఆసీస్ స్టార్ పేసర్ మెగాన్ షూట్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. కొత్త బంతితో బౌలింగ్ చేసే షూట్.. మంధానాను ఇప్పటివరకు వన్డేల్లో 4 సార్లు అవుట్ చేసింది. మంధానతో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ బ్యాట్ ఝుళిపిస్తే భారత్‌కు తిరిగుండదు.
మిడిలార్డర్‌లో రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్, రిచా ఘోష్‌లు తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. అప్పుడే ఆసీస్ వంటి పటిష్టమైన జట్టును మన అమ్మాయిలు ఆపగలరు. బౌలింగ్‌లో భారత్‌కు రేణుకా సింగ్, దీప్తీ శర్మ, రాధా యాదవ్ కీలకం కానున్నారు. ఆసీపై స్పిన్నర్ రాధా యాదవ్‌కు మంచి రికార్డు ఉంది.

ఆసీస్‌దే పైచేయి..
భారత్-ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఆసీస్ రెండింట విజయం సాధించగా.. భారత్ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందింది. 2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మహిళలపై భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 171 పరుగుల చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడింది.
చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు


