
నేడు విశాఖపట్నంలో మహిళల వరల్డ్ కప్ మ్యాచ్
దక్షిణాఫ్రికాతో టీమిండియా ‘ఢీ’
హ్యట్రిక్ విజయంపై హర్మన్ బృందం గురి
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
శ్రీలంకతో మ్యాచ్‌లో 124/6... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 159/5... అదృష్టవశాత్తూ ఈ రెండు సందర్భాలను అధిగమించి భారత జట్టు విజయాన్ని అందుకుంది. అయితే అవి రెండూ మనతో పోలిస్తే సహజంగానే బలహీన జట్లు. ఇలాంటి పొరపాటే పెద్ద జట్లతో జరిగితే కోలుకోవడానికి అవకాశం ఉండదు.
టోర్నీలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వీటిలో మన ప్రదర్శనపైనే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరే అవకాశాలతో పాటు జట్టు అసలు సత్తా ఏమిటో తేలనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వేదికగా సఫారీ టీమ్‌తో పోరుకు భారత్ ‘సై’ అంటోంది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా టీమ్ కూడా అమితోత్సాహంతో బరిలోకి దిగుతోంది.
సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో విశాఖపట్నం వేదికగా మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుండగా... భారత్ తొలి రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో భాగంగా నేడు ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ బృందం తలపడుతుంది. టోర్నీలో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలవగా... దక్షిణాఫ్రికా ఒకటి ఓడి, మరొకటి గెలిచింది.
బరిలోకి అమన్‌జోత్...
టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో చూస్తే భారత బ్యాటింగ్ బలహీనత కనిపించింది. టాప్ బ్యాటర్లయిన స్మృతి, హర్మన్ విఫలం కాగా, లోయర్ ఆర్డర్ ఆదుకుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించేలా ఉంది. ఇలాంటి స్థితిలో వీరిద్దరు తమ స్థాయికి తగిన ప్రదర్శన కనబర్చడం కీలకం. ఈ ఏడాది అసాధారణ ఫామ్‌లో ఉన్న స్మృతి అసలు సమరంలో విఫలం కావడం ఆందోళన కలిగించే అంశం. మిడిలార్డర్‌లో జెమీమా శ్రీలంకపై డకౌట్ అయినా, పాక్‌పై మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించింది.
గత రెండు మ్యాచ్‌లలో ఈ ముగ్గురి ఆటను కలిపి చూస్తే అత్యధిక స్కోరు 32 మాత్రమే. బౌలింగ్‌కు సంబంధించి గత మ్యాచ్‌లో ఐదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ఆడింది. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తే ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రత్యామ్నాయంగా ఆరో బౌలర్ అవసరం.
అనారోగ్యంతో గత మ్యాచ్‌కు దూరమైన అమన్‌జోత్ కోలుకుంది. దాంతో తుది జట్టులోకి రావడం ఖాయం. అయితే ఎవరి స్థానంలో ఆమె ఆడుతుందనేది ఆసక్తికరం. ఆమె స్థానంలో ఆడిన రేణుక పాక్‌పై సత్తా చాటింది. తొలి రెండు మ్యాచ్‌లలో మన ఫీల్డింగ్ ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. దీనిని కూడా సరిదిద్దుకోవాల్సి ఉంది.
ఆత్మవిశ్వాసంతో సఫారీ టీమ్...
ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌లో 69 ఆలౌట్ తర్వాత న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా ఆటతీరు చూస్తే ఆ జట్టు ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. బ్రిట్స్ సెంచరీతో చెలరేగగా... లూస్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. సీనియర్లు వోల్‌వార్ట్, మరిజాన్ కాప్ అనుభవం జట్టుకు కీలకం కానుంది. పేసర్లు ఖాకా, క్లాస్ కూడా ప్రభావం చూపగలరు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా జట్టులో తడబాటు కనిపిస్తున్నా... బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలిస్తే భారీ స్కోరు సాధించగల సామర్థ్యం టీమ్‌కు ఉంది.
ఇద్దరు మాత్రమే...
మ్యాచ్ ముందు రోజు భారత జట్టు ఆప్షనల్ ప్రాక్టీస్ అవకాశం ఇచ్చారు. దాంతో ఇద్దరు మినహా జట్టు సభ్యులెవరూ మైదానానికి రాలేదు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ మాత్రమే సాధనలో పాల్గొన్నారు. టీమ్ కొలంబో నుంచి వచ్చిన తర్వాత మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న వీరిద్దరు మరుసటి రోజు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
శ్రీచరణి సత్తా చాటేనా...
భారత్‌తో మ్యాచ్‌లో ఇనోకా రణవీరా అద్భుత బంతితో జెమీమాను బౌల్డ్ చేసింది. ఇది టోర్నీలోనే అత్యుత్తమ బంతని, తానే కాదు ఎవరూ ఆడలేరని జెమీమా స్వయంగా అంగీకరించింది. మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లతో ఇనోకా సత్తా చాటింది. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ బౌలర్ లిన్సీ స్మిత్ 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ బౌలర్ ఎంలాబా 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని కట్టిపడేసింది.
ఈ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే కావడం విశేషం. టోర్నీలో వారి ప్రభావం ఎలా నడుస్తుందో ఇది చూపిస్తోంది. భారత జట్టులోని లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి కూడా సొంతగడ్డపై ఇదే తరహా ప్రదర్శన కనబర్చాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. రెండో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధ యాదవ్‌కు ఇంకా మ్యాచ్ దక్కలేదు కానీ... లంకపై శ్రీచరణి ఫర్వాలేదనిపించగా, పాక్‌తో పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి 11 వన్డేల స్వల్ప కెరీర్‌లో అందరినీ ఆకట్టుకుంది. అయితే తనకంటూ ప్రత్యేకంగా చెప్పుకునే ప్రదర్శన ఆమె నుంచి ఇంకా రాలేదు. దానిని చూపించేందుకు ఆమెకు సొంత రాష్ట్రానికి మించి సరైన వేదిక లభించదు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అంచనాలకు తగినట్లుగా చెలరేగితే చరణికి ఇకపై తిరుగుండదు.
పిచ్, వాతావరణం
భారత్ ఆడిన గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఇది బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. జెమీమా పరిశీలన ప్రకారం కనీసం 270 స్కోరు చేయవచ్చు. బుధవారం నగరంలో వాన కురిసింది. మ్యాచ్ రోజు కూడా స్వల్పంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్, జెమీమా, దీప్తి, స్నేహ్, రిచా, శ్రీచరణి, క్రాంతి, రేణుక/అమన్‌జోత్.
దక్షిణాఫ్రికా: వోల్‌వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, లూస్, కాప్, బాష్, జాఫ్తా, ట్రైఆన్, డి క్లెర్క్, క్లాస్, ఖాకా, ఎంలాబా.
5 విశాఖపట్నంలో భారత మహిళల జట్టు ఆడిన 5 వన్డేల్లోనూ విజయం సాధించింది. ఈ వేదికలో శ్రీలంకపై 3 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌పై 2 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది.
20 భారత్, దక్షిణాఫ్రికా మధ్య 33 వన్డేలు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గింది. 12 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది.