
టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు నాలుగు రోజుల మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ అనంతరం జరగనున్న ఇంగ్లండ్ పర్యటనకు బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి మెరుగైన ఫలితం సాధించాలనే ఉద్దేశంతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ టీమ్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఎర్రబంతితో నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ మ్యాచ్‌ల్లో ప్రధాన ఆటగాళ్లు కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి హెడింగ్లే వేదికగా తొలి టెస్టు జరగనుంది. దానికంటే ముందే భారత ‘ఎ’ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.
‘ఇంగ్లండ్ లయన్స్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య మే 30న కాంటర్‌బరీలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 6 నుంచి నార్తంప్టన్‌లో రెండో మ్యాచ్ నిర్వహిస్తాం’ అని ఇంగ్లండ్, వెల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. మే 25 ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా... ఆ తర్వాతే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది.
కరుణ్ నాయర్‌కు పిలుపు..
దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇంగ్లండ్‌కు పంపాలని బీసీసీఐ భావిస్తోంది. విదర్భ జట్టు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరుణ్ నాయర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ‘జట్టును ప్రకటించేందుకు ఇంకా చాలా సమయం ఉంది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ముందు ఆటగాళ్ల ఎంపికపై ఒక స్పష్టత వస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ‘వైట్ వాష్’కు గురైన టీమిండియా... ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోనూ ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్‌ను ప్రారంభించనుంది.