టీమిండియా అభిమానులకు పండుగే పండుగ! | India To Play T20I Series In Ireland Before England Tour: Report | Sakshi
Sakshi News home page

టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!

Mar 20 2026 5:14 PM | Updated on Mar 20 2026 6:23 PM

India To Play T20I Series In Ireland Before England Tour: Report

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్‌-2026 ముగిసిన తర్వాత జూన్‌ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య సిరీస్‌ జరుగుతుంది.

ముందుగా ఐర్లాండ్‌ టూర్‌కు!
ఇందులో భాగంగా భారత్‌- అఫ్గన్‌ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్‌ టూర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

ఐర్లాండ్‌ హై పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌ గ్రాహమ్‌ వెస్ట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఐర్లాండ్‌ కనీసం సూపర్‌-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.

మంచి బూస్ట్‌
ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్‌ స్టెర్లింగ్‌ కెప్టెన్‌ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్‌-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్‌ స్టెర్లింగ్‌ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్‌కు జూన్‌లో టీమిండియాతో జరిగే సిరీస్‌తో మంచి బూస్ట్‌ లభిస్తుంది’’ అని గ్రాహమ్‌ వెస్ట్‌ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్‌- ఐర్లాండ్‌ సిరీస్‌ విషయాన్ని ఖరారు చేశాడు.

కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్‌లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్‌ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.

మరింత బిజీగా
అయితే, తాజాగా ఐర్లాండ్‌ టూర్‌తో భారత జట్టు షెడ్యూల్‌ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన బీసీసీఐ?

Advertisement
 
Advertisement
Advertisement