
ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు నిర్వహణ
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ జరుగనుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. 23 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. చివరిసారి 2002లో హైదరాబాద్ వేదికగా ప్రపంచకప్ జరగ్గా... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు. అయితే ఈసారి జరగబోయేది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించే ప్రపంచకప్ ఈవెంట్.
ఇందులో ప్రపంచవ్యాప్తంగా 206 మంది ఆటగాళ్లు తలపడతారు. ఇది నాకౌట్ టోర్నీ. ప్రతీ రౌండ్‌లో ఓడిన ఆటగాడు నిష్క్రమిస్తాడు. ‘కొన్నేళ్లపాటు చెస్ టోర్నీ వివిధ ఫార్మాట్లుగా జరిగింది. కానీ 2021 నుంచి నాకౌట్ పద్ధతిలోనే ప్రపంచకప్ నిర్వహిస్తున్నాం. ఒక రౌండ్ మూడు రోజుల పాటు జరుగుతుంది. రెండు క్లాసికల్ గేమ్‌లను నిర్వహిస్తారు. సమమైతే మూడో రోజు టైబ్రేక్ పోటీ ఉంటుంది’ అని అంతర్జాతీయ చెస్ సమాఖ్య తెలిపింది. 2023లో అజర్‌బైజాన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కార్ల్‌సన్ (నార్వే) విజేతగా... ప్రజ్ఞానంద (భారత్) రన్నరప్‌గా నిలిచారు.