సిరీస్‌ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష!  | India Eye On Winning Series Vs England 2nd T20 Match Birmingham | Sakshi
Sakshi News home page

IND vs ENG 2nd T20: సిరీస్‌ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష! 

Jul 9 2022 12:37 AM | Updated on Jul 9 2022 7:48 AM

India Eye On Winning Series Vs England 2nd T20 Match Birmingham - Sakshi

అయితే అనూహ్య ఓటమి నుంచి కోలుకొని సిరీస్‌ కాపాడుకునేందుకు బట్లర్‌ బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్‌ నుంచి సీనియర్లు అందుబాటులోకి రావడంతో భారత తుది జట్టు ఎలా ఉడబోతోందో అనేది ఆసక్తికరం.  

ఆతిథ్య ఇంగ్లండ్‌పై తొలి టి20లో పైచేయి సాధించిన భారత్‌ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి భారీ తేడాతో నెగ్గిన టీమిండియా అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌ను మరోసారి దెబ్బ తీయవచ్చు. అయితే అనూహ్య ఓటమి నుంచి కోలుకొని సిరీస్‌ కాపాడుకునేందుకు బట్లర్‌ బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్‌ నుంచి సీనియర్లు అందుబాటులోకి రావడంతో భారత తుది జట్టు ఎలా ఉడబోతోందో అనేది ఆసక్తికరం.  

బర్మింగ్‌హామ్‌: కోహ్లి, బుమ్రా, పంత్, జడేజా, శ్రేయస్‌... టెస్టు జట్టుతో ఉన్న కారణంగా తొలి టి20కి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నేడు జరిగే రెండో మ్యాచ్‌లో పలు మార్పులు ఖాయం. ఆటగాళ్లు మారినా అదే దూకుడు ప్రదర్శించి సిరీస్‌ అందుకోవాలని రోహిత్‌ బృందం ఆశిస్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి కూడా తొలి మ్యాచ్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌ ఇప్పుడు ఎలాంటి ఆటతీరు కనబరుస్తుందో చూడాలి. ఇటీవల మన జట్టు టెస్టు ఓడిన ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలోనే ఈ మ్యాచ్‌ జరగనుంది.  

కోహ్లికి పరీక్ష! 
టి20 తుది జట్టులో కోహ్లికి చోటు లభిస్తుందా! కొన్నాళ్ల క్రితం వరకు అసలు ఇలాంటి చర్చ గురించి ఆలోచన కూడా రాకపోయేది. కానీ ప్రస్తుత పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. కోహ్లి రికార్డు ఇప్పటికీ అద్భుతంగా ఉంది. అందులో సందేహమేమీ లేదు. అయితే సీనియర్లు వరుసగా విశ్రాంతి తీసుకుంటుండటంతో కొత్తగా అవకాశాలు దక్కించుకుంటున్న కుర్రాళ్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి స్థితిలో ఆశ్చర్యకరంగా కుదురుకున్న తర్వాత వేగంగా ఆడే కోహ్లి శైలి కాస్త నెమ్మదిగా కనిపిస్తోంది.

అయితే కోహ్లిలాంటి ఆటగాడికి ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య ఏమీ లేదు కానీ రాబోయే విండీస్‌ సిరీస్‌ నుంచి కూడా అతను విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండటంతో ఈ రెండు టి20ల్లోనే తన విలువను మళ్లీ చూపించాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌ ప్రదర్శనను బట్టి చూస్తే ఇషాన్‌ కిషన్‌ స్థానంలో కోహ్లి రావచ్చు. అయితే నిలకడగా ఆడుతున్న హుడా, సూర్యకుమార్‌లలో ఎవరిపైనైనా వేటు వేస్తారా చూడాలి. బౌలింగ్‌లో భువీ, హర్షల్, బుమ్రాలతో పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన హార్దిక్‌ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. 

బ్యాటింగ్‌పైనే భారం... 
ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ బలగాన్ని చూస్తే గత మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యం చిన్నదే అనిపించింది. అయితే దూకుడుగా ఆడబోయి ప్రధాన బ్యాటర్లంతా ఆరంభంలోనే వెనుదిరగడం దెబ్బ తీసింది. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వరాదని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఓపెనర్లు బట్లర్, రాయ్‌ శుభారంభం అందిస్తే మలాన్, లివింగ్‌స్టోన్, అలీ అదే ధాటిని కొనసాగించగలరు. అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ బౌలింగ్‌లో పెద్దగా అనుభవం లేదు. భారత్‌లాంటి బలమైన జట్టుపై అది స్పష్టంగా కనిపించింది. టాప్లీ, పార్కిన్సన్, మిల్స్‌ భారీగా పరుగులిచ్చుకున్నారు. దాంతో మరోసారి ఇంగ్లండ్‌ జట్టు విజయావకాశాలన్నీ బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement