తొలి టీ20: భారత్‌ అదరగొట్టింది

India Beat Sri Lanka By 38 Runs To Go 1-0 Up In T20I Series - Sakshi

తొలి టి20లో శ్రీలంకపై 38 పరుగులతో గెలుపు

రాణించిన సూర్యకుమార్, భువనేశ్వర్‌

కొలంబో: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. బౌలింగ్‌లో అదరగొట్టి సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన ఫామ్‌ను కొనసాగిం చాడు. శిఖర్‌ ధావన్‌ (36 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఛేజింగ్‌లో శ్రీలంక 18.3 ఓవ ర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. చరిత్‌ అసలంక (26 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువనేశ్వర్‌ (4/22) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. దీపక్‌ చహర్‌ (2/24) అతనికి చక్కటి సహకారం అందించాడు. రెండో టి20 మంగళవారం జరుగుతుంది.  

పృథ్వీ షా డకౌట్‌...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. తొలి అంతర్జాతీయ టి20 ఆడిన పృథ్వీ షా (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే అవుటై ‘గోల్డెన్‌ డక్‌’గా వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన సంజూ సామ్సన్‌ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్‌ మరోసారి అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ధావన్‌తో కలిసి అతడు మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. చివర్లో ఇషాన్‌ కిషన్‌ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌) ఆడటంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.    

కట్టడి చేసిన బౌలర్లు
ఛేదనలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. మినోద్‌ భానుక (10; 2 ఫోర్లు), ధనంజయ డిసిల్వా (9; 1 ఫోర్‌), అవిష్క ఫెర్నాండో (26; 3 ఫోర్లు)లను వరుస విరామాల్లో అవుట్‌ చేశారు. చరిత్‌ అసలంక కాసేపు ప్రతిఘటించాడు. అతడు యాషెన్‌ బండార (9; 1 ఫోర్‌)తో కలిసి నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. అయితే దీపక్‌ చహర్‌ అసలంకను అవుట్‌ చేయగా... ఆశలు పెట్టుకున్న కెప్టెన్‌ షనక (16; 1 ఫోర్‌) వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో స్టంపౌట్‌ అవ్వడంతో భారత్‌ గెలుపు ఖాయమైంది.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) మినోద్‌ (బి) చమీర 0; ధావన్‌ (సి) బండార (బి) కరుణరత్నే 46; సామ్సన్‌ (ఎల్బీ) (బి) హసరంగ 27; సూర్యకుమార్‌ (సి) (సబ్‌) మెండిస్‌ (బి) హసరంగ 50; హార్దిక్‌ (సి) మినోద్‌ (బి) చమీర 10; ఇషాన్‌ (నాటౌట్‌) 20; కృనాల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–0, 2–51, 3–113, 4–127, 5–153. బౌలింగ్‌: చమీర 4–0–24–2, కరుణరత్నే 4–0–34–1, అకిల 3–0–40–0, ఉదాన 4–0–32–0, హసరంగ 4–0–28–2, షనక 1–0–4–0.

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) సామ్సన్‌ (బి) భువనేశ్వర్‌ 26; మినోద్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కృనాల్‌  10; ధనంజయ డిసిల్వా (బి) చహల్‌ 9; అసలంక (సి) పృథ్వీ (బి) దీపక్‌ 44; బండార (బి) హార్దిక్‌  9; షనక (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) వరుణ్‌ 16; హసరంగ (బి) దీపక్‌ 0; కరుణరత్నే (బి) భువనేశ్వర్‌ 3; ఉదాన (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 1; చమీర (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 1; అకిల (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో) 126 ఆలౌట్‌.
వికెట్ల పతనం: 1–23, 2–48, 3–50, 4–90, 5–111, 6–111, 7–122, 8–124, 9–125, 10–126.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.3–0–22–4, దీపక్‌ 3–0–24–2, కృనాల్‌ 2–0–16–1, వరుణ్‌ 4–0–28–1, చహల్‌ 4–0–19–1, హార్దిక్‌ 2–0–17–1.  
సూర్యకుమార్‌
భువనేశ్వర్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top