‘శత’క్కొట్టిన జెమీమా | India beat South Africa by 23 runs in the last league match | Sakshi
Sakshi News home page

‘శత’క్కొట్టిన జెమీమా

May 8 2025 12:48 AM | Updated on May 8 2025 12:48 AM

India beat South Africa by 23 runs in the last league match

ఫైనల్లో భారత మహిళల జట్టు

మెరిసిన దీప్తి శర్మ, స్మృతి మంధాన

చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 23 పరుగులతో విజయం

ఆదివారం శ్రీలంకతో టైటిల్‌ పోరు  

కొలంబో: ముక్కోణపు మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. భారత జట్టు తమ నాలుగు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్‌కు దూరమైంది. 

భారత్‌ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో ఆతిథ్య శ్రీలంక జట్టు మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శుక్రవారం జరిగే నామమాత్రమైన చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా తలపడతాయి. భారత్, శ్రీలంక జట్ల మధ్య టైటిల్‌ పోరు ఆదివారం జరుగుతుంది. ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా దక్షిణాఫ్రికాతో పోరు ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (101 బంతుల్లో 123; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సఫారీ బౌలర్ల భరతం పట్టి కెరీర్‌లో రెండో సెంచరీ సాధించింది.

ఓపెనర్‌ స్మృతి మంధాన (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) కెరీర్‌లో 31వ అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా... దీప్తి శర్మ (84 బంతుల్లో 93; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి త్రుటిలో శతకాన్ని చేజార్చుకుంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి ఓడిపోయింది. అనెరి డెరెక్సన్‌ (80 బంతుల్లో 81; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), చోల్‌ ట్రయాన్‌ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. 

గాయం కారణంగా దక్షిణాఫ్రికా రెగ్యులర్‌ కెపె్టన్‌ లౌరా వొల్వార్ట్‌ ఈ మ్యాచ్‌కు దూరంకాగా... చోల్‌ ట్రయాన్‌ సారథిగా వ్యవహరించింది. ఈ మ్యాచ్‌తో శుచి ఉపాధ్యాయ్‌ (భారత్‌), మియాని స్మిట్‌ (దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 

122 పరుగుల భాగస్వామ్యం 
ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ప్రతీక (1), హర్లీన్‌ డియోల్‌ (4), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (20 బంతుల్లో 28; 6 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో స్మృతి, జెమీమా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. స్మృతి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అవుటవ్వగా... జెమీమాతో దీప్తి శర్మ జత కలిసింది. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో భారత స్కోరు బోర్డులో వేగం పెరిగింది. ఈ క్రమంలో జెమీమా శతకం పూర్తి చేసుకుంది. 

ఐదో వికెట్‌కు వీరిద్దరూ 122 పరుగుల భాగస్వామ్యం జోడించాక జెమీమా పెవిలియన్‌ చేరుకుంది. వన్డేల్లో ఐదో వికెట్‌కు భారత్‌కిదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్‌–వేద కృష్ణమూర్తి (108 పరుగులు) పేరిట ఉండేది. జెమీమా అవుటయ్యాక దీప్తి శర్మ మరింత దూకుడు పెంచడంతో భారత స్కోరు 300 పరుగులు దాటింది. ఏడు పరుగుల తేడాతో దీప్తి శర్మ సెంచరీని కోల్పోయింది. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ విజయంపై ఆశలు రేకెత్తించలేదు. డెరెక్సన్, ట్రయాన్‌ మెరిపించినా దక్షిణాఫ్రికా విజయానికి సరిపోలేదు. భారత బౌలర్లలో అమన్‌జోత్‌ కౌర్‌ మూడు వికెట్లు పడగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: ప్రతీక రావల్‌ (సి) డెరెక్సన్‌ (బి) డి క్లెర్క్‌ 1; స్మృతి మంధాన (సి) డి క్లెర్క్‌ (బి) ట్రయాన్‌ 51; హర్లీన్‌ డియోల్‌ (బి) క్లాస్‌ 4; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) షాంగేస్‌ (బి) డెరెక్సన్‌ 28; జెమీమా రోడ్రిగ్స్‌ (సి) సునె లుస్‌ (బి) క్లాస్‌ 123; దీప్తి శర్మ (సి) ట్రయాన్‌ (బి) డి క్లెర్క్‌ 93; రిచా ఘోష్‌ (సి) బ్రిట్స్‌ (బి) మలాబా 20; అమన్‌జోత్‌ కౌర్‌ (సి) స్మిట్‌ (బి) మలాబా 5; శ్రీ చరణి (రనౌట్‌) 6; స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–9, 2–18, 3–50, 4–138, 5–260, 6–296, 7–314, 8–336, 9–337. బౌలింగ్‌: మసబటా క్లాస్‌ 8–0–51–2, నదినె డి క్లెర్క్‌ 9–0–54–2, అనెరి డెరెక్సన్‌ 6–0–36–1, మలాబా 8–0–71–2, షాంగేస్‌ 6–0–43–0, చోల్‌ ట్రయాన్‌ 8–0–46–1, సునె లుస్‌ 3–0–15–0, మియాని స్మిట్‌ 2–0–20–0. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: లారా గుడాల్‌ (సి) రిచా ఘోష్‌ (బి) అమన్‌జోత్‌ కౌర్‌ 4; తజ్మీన్‌ బ్రిట్స్‌ (సి) జెమీమా (బి) అమన్‌జోత్‌ కౌర్‌ 26; మియాని సిŠమ్‌ట్‌ (బి) దీప్తి శర్మ 39; అనెరి డెరెక్సన్‌ (బి) అమన్‌జోత్‌ కౌర్‌ 81; షాంగేస్‌ (సి) హర్లీన్‌ డియోల్‌ (బి) ప్రతీక రావల్‌ 36; సినాలో జాఫ్టా (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీ చరణి 21; చోల్‌ ట్రయాన్‌ (బి) దీప్తి శర్మ 67; నదినె డి క్లెర్క్‌ (నాటౌట్‌) 22; సునె లుస్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 314. వికెట్ల పతనం: 1–7, 2–70, 3–89, 4–159, 5–188, 6–260, 7–311. బౌలింగ్‌: స్నేహ్‌ రాణా 7–1–53–0, అమన్‌జోత్‌ కౌర్‌ 9–0–59–3, శ్రీ చరణి 10–0–58–1, శుచి ఉపాధ్యాయ్‌ 9–0–59–0, దీప్తి శర్మ 10–0–57–2, ప్రతీక రావల్‌ 3–0–15–1, స్మృతి మంధాన 2–0–12–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement