Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా అరుదైన ఘనత! టీమిండియా తొలి ఆల్‌రౌండర్‌గా..

Ind Vs WI 3rd T20: Hardik Pandya Reaches Rare Landmark Joins Elite List - Sakshi

India Vs West Indies 3rd T20: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన హార్దిక్‌.. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. రెండో టీ20లో విండీస్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

ఇక ఈ కీలక వికెట్‌ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా హార్దిక్‌ పాండ్యా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అదే విధంగా పొట్టి క్రికెట్‌లో 800కు పైగా పరుగులు, 50 లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

ఈ క్రమంలో విండీస్‌ దిగ్గజం డ్వేన్‌బ్రావో, బంగ్లాదేశ్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ వంటి ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఈ ఘనత సాధించిన భారత తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు. కాగా విండీస్‌తో మూడో టీ20లో హార్దిక్‌ పాండ్యా బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే రోహిత్‌ సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

రెట్టించిన ఉత్సాహంతో..
ఫిట్‌నెస్‌ సమస్యలు అధిగమించి.. ఐపీఎల్‌-2022తో ఫామ్‌లోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. క్యాష్‌ రిచ్‌లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌కు సారథ్యం వహించి ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్‌ పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించి టీ20 సిరీస్‌ గెలిపించాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 800కు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లు:
1. షకీబ్‌ అల్‌ హసన్‌(బంగ్లాదేశ్‌)- పరుగులు 2010- వికెట్లు 121
2. షాహిద్‌ ఆఫ్రిది(పాకిస్తాన్‌)- పరుగులు 1416, వికెట్లు 98
3. డ్వేన్‌ బ్రావో(వెస్టిండీస్‌)- పరుగులు 1255, వికెట్లు 78
4. మహ్మద్‌ నబీ(అఫ్గనిస్తాన్‌)- 1628 పరుగులు, వికెట్లు 76

5. మహ్మద్‌ హఫీజ్‌(పాకిస్తాన్‌)- పరుగులు 2514, వికెట్లు 61
6. కెవిన్‌ ఒబ్రెయిన్‌(ఐర్లాండ్‌)- పరుగులు 1973, వికెట్లు 58
7. హార్దిక్‌ పాండ్యా(ఇండియా)- పరుగులు 806, వికెట్లు 50
చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌.. బీసీసీఐ కీలక అప్‌డేట్‌.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top