Ind Vs Sl: పూర్తిగా నిరాశపరిచాడు.. జట్టులో చోటు దక్కకపోవచ్చు!

Ind Vs Sl: Sehwag Says This Player May No Longer Chance In ODIs - Sakshi

న్యూఢిల్లీ: 26.. 37... 11... శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మనీశ్‌ పాండే చేసిన పరుగులు. ఈ గణాంకాలను అనుసరించి... మూడు వన్డేల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ మనీశ్‌, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడంటున్నాడు భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌‌. భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తున్న సమయంలోనూ హిట్టింగ్‌ ఆడలేక, తనను నిరాశపరిచాడని పెదవి విరిచాడు. అదే సమయంలో సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌ ఆటతో ఆకట్టుకున్నారని, కాబట్టి మిడిలార్డర్‌లో మనీశ్‌ను ఇకపై చూసే అవకాశం ఉండకపోవచ్చని వీరూ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైన ధావన్‌ సేన.. 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ... ‘‘హార్దిక్‌ పాండ్యా, మనీశ్‌ పాండ్యా.. ఇద్దరూ పెద్దగా రాణించలేదు. 15- 20 పరుగులు చేసేందుకు ఆయాసపడ్డారు. నిజానికి ఈ సిరీస్‌లో అత్యంత ప్రయోజనం పొందింది ఎవరైనా ఉన్నారంటే అది మనీశ్‌ పాండే. తను మూడు మ్యాచ్‌లు ఆడాడు. పెద్దగా ఒత్తిడి కూడా లేదు. అయినా, సత్తా చాటలేకపోయాడు. నాకు తెలిసి తనకు ఇక వన్డేల్లో చాన్స్‌ రాకపోవచ్చు... ఒకవేళ జట్టులో చోటు దక్కినా తనను తాను నిరూపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. వీరి పరిస్థితి ఇలా ఉంటే, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ మిడిలార్డర్‌లో స్థానం సుస్థిరం చేసుకునేలా కనిపిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. యువ ఓపెనర్‌ పృథ్వీ షా(43, 13, 49) కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని ప్రశంసించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top