India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్‌ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్‌ తివారి

Ind Vs Sa: Manoj Tiwary Slams Selectors What Did You See In KL Rahul As Captain - Sakshi

టీమిండియా సెలక్టర్ల తీరును టీమిండియా వెటరన్‌ ఆటగాడు, పశ్చిమ బెంగాల్‌ క్రీడా శాఖా మంత్రి మనోజ్‌ తివారి తప్పుబట్టారు. అసలు కేఎల్‌ రాహుల్‌లో ఏ లక్షణాలు చూసి అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేశారని మండిపడ్డారు. కాగా ఇటీవల టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో విరాట్‌ కోహ్లిని తప్పించి.. వన్డే కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు గాయపడటంతో... వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించాడు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఎంతటి ఘోర పరాభవం ఎదురైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రొటిస్‌ చేతిలో ఏకంగా 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. 

ఈ నేపథ్యంలో రాహుల్‌ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు సైతం అతడి నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పోర్ట్స్‌కీడాతో ముచ్చటించిన మనోజ్‌ తివారి సైతం ఈ విషయంపై స్పందించారు. నాయకుడిని తయారు చేయడం కాదని, అతడిలో సహజంగా ఆ లక్షణాలు ఉండాలంటూ చురకలు అంటించారు. సెలక్టర్ల తీరు సరిగా లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... ‘‘అసలు రాహుల్‌లో కెప్టెన్సీ మెటీరియల్‌ మీకేం కనిపించింది? భవిష్యత్తు కెప్టెన్‌ను తయారు చేస్తున్నాం అంటారు. కెప్టెన్సీ సహజసిద్ధంగా అలవడాలి. వాళ్లు చెప్పినట్లు సారథిని తయారు చేయడం సాధ్యమే. కానీ... ఆ ప్రక్రియ అంత సులభమేమీ కాదు. 

అందుకు చాలా సమయం పడుతుంది. కనీసం 20 నుంచి 25 మ్యాచ్‌లు ఆడిన తర్వాత గానీ... స్వతహాగా నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అయినా కూడా కెప్టెన్‌గా విజయం సాధిస్తారన్న గ్యారెంటీ లేదు. ఇండియాకు ప్రతి అంతర్జాతీయ ముఖ్యమే కదా! అలాంటపుడు ఇలాంటి రిస్క్‌ ఎందుకు?’’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డును మనోజ్‌ తివారి పరోక్షంగా ప్రస్తావించారు. కాగా పంజాబ్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించిన రాహుల్‌​ జట్టును కనీసం ప్లేఆఫ్స్‌నకు కూడా చేర్చలేకపోయాడు. 

ఈ నేపథ్యంలో... ‘‘మనకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయాం. సెలక్టర్ల తప్పుడు నిర్ణయాల వల్లే ఇంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వారి తీరు నిరాశ పరిచింది. కెప్టెన్‌గా రాహుల్‌ నిరూపించుకున్నది లేదు. అయినా... అతడిలో ఏ లక్షణాలు చూసి సారథ్య బాధ్యతలు అప్పగించారో అర్థం కావడం లేదు. సెలక్టర్ల నిర్ణయం నిజంగా నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది’’ అని మనోజ్‌ తివారి పేర్కొన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నద్ధమవుతోంది.​

చదవండి: Ravi Bishnoi: ఐపీఎల్‌లో 4 కోట్లు... ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టులో చోటు.. అదిరిందయ్యా రవి.. అంతా ఆ దిగ్గజ క్రికెటర్‌ వల్లే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top