Ravi Bishnoi: ఐపీఎల్‌లో 4 కోట్లు... ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టులో చోటు.. అదిరిందయ్యా రవి.. అంతా ఆ దిగ్గజ క్రికెటర్‌ వల్లే!

Ind Vs Wi: Ravi Bishnoi Credits India Great Maiden Call Up Celebrations Outside His Home - Sakshi

Ind Vs Wi- Ravi Bishnoi Reaction After ODI T20 Call Up: భారత యువ క్రికెటర్‌ రవి బిష్ణోయి ఆనందడోలికల్లో తేలియాడుతున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌ నేపథ్యంలో బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. రవితో పాటు అతడి శ్రేయోలాభిలాషులు, అభిమానులు సైతం పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రాజస్తాన్‌లోని రవి ఇంటి ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి సందడి చేశారు. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా అతడికి అభినందనలు తెలియజేశారు.

కాగా స్వదేశంలో విండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు సిరీస్‌లకు రవి బిష్ణోయిని ఎంపిక చేశారు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా 21 ఏళ్ల ఈ యువ స్పిన్నర్‌ పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో లక్నో సూపర్‌ జాయింట్స్‌ జట్టు రవిని ఎంపిక చేసుకుంది. సుమారు 4 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడంతో రవి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

అంతా ఆయన వల్లే...
ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ఐపీఎల్‌ నుంచి టీమిండియా వరకు తన ప్రయాణంలో భారత దిగ్గజం, పంజాబ్‌ కింగ్స్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన అనిల్‌ కుంబ్లే పాత్ర మరువలేనిదన్నాడు. స్పోర్ట్స్‌ స్టార్‌తో ముచ్చటించిన రవి బిష్ణోయి... ‘‘అనిల్‌ సర్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒత్తిడిలోనూ ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన నన్ను ప్రోత్సహించారు.

మనలోని బలాలను గుర్తించి వాటిని సరైన సమయంలో సరిగ్గా వినియోగించుకోవాలని చెప్పేవారు. ప్రణాళికలను మైదానంలో పక్కాగా అమలు చేయాలని, అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నేర్పారు. మెరుగైన క్రికెటర్‌గా ఎదగడంలో ఈ సలహాలు, సూచనలు నాకెంతగానో తోడ్పడ్డాయి’’ అని చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి: IND vs WI: జ‌ట్టును ప్ర‌క‌టించిన వెస్టిండీస్.. సీనియర్ బౌల‌ర్ రీ ఎంట్రీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top