IND VS SA 3rd ODI: తిప్పేసిన స్పిన్నర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డు

IND VS SA 3rd ODI: South Africa Records Fourth Lowest Score In ODIs - Sakshi

టీమిండియాతో ఇవాళ (అక్టోబర్‌ 11) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. నేటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ టీమ్‌.. 27.1 ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/18), వాషింగ్టన్‌ సుందర్‌ (2/15), షాబాజ్‌ అహ్మద్‌ (2/32) ధాటికి సఫారీ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది. వీరికి సిరాజ్‌ (2/17) సహకరించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. వీరిలో క్లాసెన్‌ (34) టాప్‌ స్కోరర్‌ కాగా.. జన్నెమాన్‌ మలాన్‌ 15, జన్సెన్‌ 14 పరుగులు సాధించారు.

వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్‌..
ఈ మ్యాచ్‌లో 99 పరుగులకే చాపచుట్టేసిన దక్షిణాఫ్రికా వన్డేల్లో తమ నాలుగో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. 1993 ఆసీస్‌పై చేసిన 63 పరుగులు ఆ జట్టు వన్డే చరిత్రలో అత్యల్ప స్కోర్‌ కాగా.. 2008లో ఇంగ్లండ్‌పై 83 పరుగులు, ఈ ఏడాది అదే ఇంగ్లండ్‌పై మరోసారి 83 పరుగులకే ఆలౌటై వన్డేల్లో తమ రెండు, మూడు అత్యల్ప స్కోర్లను నమోదు చేసింది. తాజాగా టీమిండియాపై 99 పరుగులకే ఆలౌటై వన్డేల్లో తమ నాలుగో అత్యల్ప స్కోర్‌ను రికార్డు చేసింది. 1999లో నైరోబీలో చేసిన 117 పరుగులు భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇప్పటివరకు అత్యల్ప స్కోర్‌గా ఉండేది. ఈ మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ ఆ రికార్డును కూడా చెరిపేసింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top