Ind Vs SA- WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023కి మేము ‘అర్హత’ సాధించడం కష్టమని తెలుసు! అయినా..

Ind Vs SA 1st ODI Klaasen: Qualifying For 2023 WC Going To Be Hard But - Sakshi

Ind Vs SA 1st ODI- ICC Men's Cricket World Cup Super League: టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. డేవిడ్‌ మిల్లర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. క్లాసెన్‌ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు, మిల్లర్‌ 63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచారు.

వీరిద్దరి సూపర్‌ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 40 ఓవర్ల(వర్షం కారణంగా కుదించారు)లో 4 వికెట్లు నష్టపోయి 249 పరుగుల స్కోరు చేసింది ప్రొటిస్‌ జట్టు. ఇక ఆఖరి వరకు టీమిండియా గట్టి పోటీనిచ్చినా సౌతాఫ్రికా బౌలర్లు లాంఛనం పూర్తి చేసి తమ జట్టుకు విజయం అందించారు. 

దక్షిణాఫ్రికాకు ‘నో ఛాన్స్‌’!
ఇక ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ నేపథ్యంలో.. ఈ విజయంతో సౌతాఫ్రికాకు 10 పాయింట్లు లభించాయి. మొత్తంగా ఇప్పటి వరకు 59 పాయింట్లు సాధించిన ప్రొటిస్‌ జట్టు పదకొండో స్థానంలో ఉంది. కానీ.. మిగిలిన మ్యాచ్‌లు గెలిచినా కూడా దక్షిణాఫ్రికాకు నేరుగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఈవెంట్‌కు అర్హత సాధించే అవకాశం లేదు. 

కాగా సూపర్‌లీగ్‌లో టాప్‌-8లో నిలిచిన జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీకి నేరుగా క్వాలిఫై అవుతాయన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మొదటి వన్డేలో ప్రొటిస్‌ చేతిలో ఓడిన టీమిండియాకు(పట్టికలో ప్రస్తుతం ఆరోస్థానంలో ఉంది).. ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న కారణంగా మిగతా జట్లతో అసలు పోటీనే లేదు. ఆతిథ్య జట్టు నేరుగా క్వాలిఫై అవుతుంది.

మేము క్వాలిఫై అవడం కష్టమే.. కానీ
ఈ నేపథ్యంలో తొలి వన్డేలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన క్లాసెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్‌కప్‌ టోర్నీకి అర్హత సాధించడం మాకు చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలుసు. అయితే, ప్రస్తుతం మా దృష్టి మొత్తం టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌పైనే ఉంది. 

మా ఆధీనంలో లేని అంశాల గురించి ఆలోచించడం వృథా. ఏదేమైనా ఒక్కసారి సౌతాఫ్రికన్‌ జెర్సీ వేసుకుని మైదానంలోకి దిగామంటే గెలుపు కోసం ఆడటమే మా లక్ష్యం. ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ ఆత్మవిశ్వాసం పోగు చేసుకుంటాం. ఇక ఇండియాతో మ్యాచ్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

టీమిండియా సహా..
కాగా వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉండగా.. టీ20 లీగ్‌ కారణంగా దానిని రద్దు చేసుకుంది సౌతాఫ్రికా. దీంతో వన్డే వరల్డ్‌కప్‌-2023 అర్హత అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇక లక్నో వన్డే తర్వాత ప్రొటిస్‌ జట్టుకు ఈ సైకిల్‌లో ఇంకా ఏడు వన్డేలు మిగిలి ఉన్నాయి. టీమిండియా సహా నెదర్లాండ్స్‌, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

వీటన్నింటిలో గెలిచినా బవుమా బృందానికి 70 పాయింట్లు వస్తాయి. ఒకవేళ అన్నిటికి అన్ని గెలిచినా మిగతా జట్ల గెలుపోటములపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. నేరుగా అర్హత సాధించకపోతే ఐర్లాండ్‌ వంటి జట్లతో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్లాసెన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

చదవండి: గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..?
Ind Vs Pak T20: దాయాది చేతిలో భారత్‌కు తప్పని భంగపాటు.. అప్పుడు అలా! ఇప్పుడిలా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top