
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో వరుణుడు అడ్డు పడడంతో చేతిదాకా వచ్చిన విజయాన్ని టీమిండియా అందుకోలేకపోయింది. చేతిలో తొమ్మిది వికెట్లు.. చేయాల్సిన పరుగులు 157 కావడంతో టీమిండియా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే వర్షం రూపంలో చివరిరోజు ఆటకు పూర్తిగా అంతరాయం ఏర్పడడంతో డ్రాగా ముగిసింది. అయినప్పటికి టీమిండియా మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శనను నమోదు చేసింది. ముఖ్యంగా బౌలింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచిన భారత్ ఆతిధ్య జట్టును తక్కువ స్కోర్లకే కట్టడి చేయడంలో సఫలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో ఆగస్టు 12 నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు టీమిండియా సమాయత్తమవుతుంది.
ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు.. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ రెండో టెస్టుకు టీమిండియా ఎలెవన్ జట్టును ప్రకటించాడు. అతను ఎంపిక చేసిన 11 మందిలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. జడేజాతో పాటు శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారిలను ఎంపిక చేశాడు. వాస్తవానికి తొలి టెస్టులో జడేజా, శార్దూలిద్దరు మంచి ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్‌లో జడేజా అర్థ సెంచరీతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రావడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో రాణించాడు. ఈ ఇద్దరికి మంజ్రేకర్ తన జట్టులో అవకాశం కల్పించకపోవడంతో ట్విటర వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. '' ఫాంలో ఉన్న ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం ఏంటి... నీకు ఎంపిక చేయడం రాదు.. ఇటువంటి మానేస్తే మంచిది.. కామెంటేరీ చేసుకో.. ఇలాంటివి నీకెందుకు.. ఆ పని టీమిండియా మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది'' అంటూ ఘాటైన విమర్శలు చేశారు.