IND Vs AUS, 3rd T20: Hyderabad Uppal Crowd Enjoys Every Moment Special - Sakshi
Sakshi News home page

Ind Vs Aus 3rd T20: ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో హోరెత్తిన స్టేడియం.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ.. క్రీడాస్ఫూర్తిని చాటి!

Published Mon, Sep 26 2022 9:02 AM

Ind Vs Aus 3rd T20: Hyderabad Uppal Crowd Enjoys Every Moment Special - Sakshi

Ind vs Aus 3rd T20- Hyderabad Uppal- సాక్షి, హైదరాబాద్‌/ఉప్పల్‌: క్రికెట్‌ ఫీవర్‌కు నగరం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆదివారం ఓ వైపు బతుకమ్మ సంబురాలు మొదలవగా.. మరోవైపు ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ సంబరం ఊపేసింది. ఉరిమే ఉత్సాహంతో అభిమానులు మధ్యాహ్నం నుంచే స్టేడియానికి బారులు తీరారు. స్టేడియం వెలుపల తమ బుగ్గలకు త్రివర్ణాలను వేయించుకున్నారు. చేతుల్లో జెండాలతో సందడి చేశారు.

జింఖానా తొక్కిసలాట నేపథ్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ), రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పకడ్బందీ చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ, చెకింగ్‌ పాయింట్ల వద్ద కాస్త నిరీక్షణ మినహా మిగతా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు, అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు.

ఇక సూర్యాస్తమయానికి ముందే స్టేడియం దాదాపుగా నిండిపోయింది. అభిమానుల కోలాహలం, చప్పట్లు, అరుపులు, కేకలతో స్టేడియం హోరెత్తింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేసినప్పటికీ ప్రేక్షకులంతా క్రీడాస్ఫూర్తి చాటారు. ఆటగాళ్లను హుషారెత్తించారు. ప్రతి బౌండరీకి, సిక్సర్‌కు మైదానం దద్దరిల్లిపోయింది.

మొత్తానికి మ్యాచ్‌ను ఫలితంతో సంబంధం లేకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించారు. గంటల తరబడి ఎదురుచూపులు క్రికెటర్లను చూడటానికి అభిమానులు ఉప్పల్‌ ఏక్‌ మినార్‌ మజీద్‌ వద్ద రోడ్డుకు ఇరువైపులా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచే నిలబడ్డారు.

ఎన్‌జీఆర్‌ గేట్‌–1నుంచి ఉప్పల్‌ స్టేడియం వద్దకు దాదాపు కిలో మీటరు పొడవునా రోడ్డుపై నిలబడి వేచి చూశారు. స్టేడియానికి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉప్పల్‌ ఏక్‌ మినార్‌ వద్దకు క్రికెటర్లు బస్సులో చేరుకున్నారు. బస్సు చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ అభివాదం చేస్తూ ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు.

జోరుగా బ్లాక్‌ టికెట్ల దందా..
ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో జోరుగా బ్లాక్‌ టికెట్ల దందా నడించింది. కొందరు యువకులు స్టేడియం పరిసరాల్లో రూ.850 టికెట్‌ను దాదాపు రూ.11000 వరకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు టికెట్లు విక్రయించే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వీరి నుంచి ఆరు టికెట్లు, రెండు సెల్‌ఫోన్‌లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులను ఉప్పల్‌ పోలీసులకు అప్పజెప్పారు. గతంలో అభిమానులకు టాయిలెట్‌ సౌకర్యం ఉండేదికాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు దాదాపు ఎనిమిది మొబైల్‌ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు.

భారీ సంఖ్యలో విదేశీయులు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశీయులు కూడా భారీ సంఖ్యలో రోడ్లపై కనిపించారు. కొందరు యువకులు వారితో సెల్ఫీలు దిగారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు వివిధ రకాల వేషధారణలతో తరలి వచ్చారు.

మరి కొందరు అభిమాన క్రికెటర్ల బొమ్మలున్న టీ షర్టులు ధరించారు. మెట్రో అదనపు ట్రిప్పులు నడపడంతో అందుబాటులో ఉన్న పీఐపీలు కూడా మెట్రో సర్వీస్‌ను వాడుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా స్టేడియం స్టేషన్‌ వద్ద వరద లాగా క్రీడాభిమానులు మెట్రో రైలు నుంచి కిందకు దిగడం కనిపించింది.

స్టేడియం ప్రాంగణంలో ఆకట్టుకున్న బతుకమ్మ
క్రికెట్‌ స్టేడియం పరిసరాల్లో గేటు నంబర్‌ – 4 వద్ద బతుకమ్మలను ఏర్పాటు చేశారు. విదేశీయులు బతుకమ్మలను ఆసక్తిగా తిలకించారు. అంతా గందరగోళం.. కేవలం టికెట్‌ ఉన్న వారిని మాత్రమే స్డేడియం వద్దకు పంపుతామన్న పోలీసులు.. అలాంటిదేమీ లేకుండా అందరినీ స్టేడియం గేట్ల వద్దకు పంపడంతో వేలాది మంది క్రికెట్‌ స్టేడియం ప్రాంగణంలోకి వచ్చారు.

ఏక్‌ మినార్‌ మజీద్‌ వద్ద, రామంతాపూర్‌ నుంచి వచ్చే వారిని ఎల్‌జీ గోడాన్‌ వద్ద ఏర్పాటు చేసిన బారికేడుల వద్ద టికెట్లను చెక్‌ చేయలేదు. దీంతో అందరినీ స్టేడియం వద్దకు పడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. టికెట్‌ లేని వేలాది అభిమానులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు. దీంతో లోనికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గాయపడిన వారితో స్టేడియానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ నెల 22న జింఖానాలో టికెట్‌ క్యూ లైన్లలో తొక్కిసలాట, తదనంతరం లాఠీచార్జిలో గాయపడిన వారిని క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రత్యేక వాహనంలో ఉచితంగా మ్యాచ్‌ చూసేందుకు ఉప్పల్‌ తీసుకొచ్చారు. ముందుగా రవీంద్రభారతిలో బాధితులను పలకరించిన ఆయన మ్యాచ్‌ చూసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వారందరినీ స్వయంగా పోలీసు మినీ బస్సులో ఎక్కించిమరీ స్టేడియం వరకు వెంట వచ్చారు.

చదవండి: IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్‌.. భారత్‌ భలే గెలుపు

Advertisement
 
Advertisement
 
Advertisement