IND VS AUS 3rd ODI: షేన్‌ వార్న్‌ పూనాడా ఏంది కుల్దీప్‌, అంతలా తిప్పేశావు..?

IND VS AUS 3rd ODI: Kuldeep Pulls A Shane Warne Out Of His Floppy Hat - Sakshi

చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్‌ సిరాజ్‌ (7-1-37-2), అక్షర్‌ పటేల్‌ (8-0-57-2), హార్ధిక్‌ పాండ్యా (8-0-44-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా నమోదు కానప్పటికీ టీమిండియా ముందు రీజనబుల్‌ టార్గెట్‌ను ఉంచింది.

కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మినహా (0) జట్టులో ప్రతి ఒక్కరు రెండంకెల స్కోర్‌ చేశారు. ట్రవిస్‌ హెడ్‌ (33), మిచెల్‌ మార్ష్‌ (47), డేవిడ్‌ వార్నర్‌ (23), లబూషేన్‌ (28), అలెక్స్‌ క్యారీ (38), స్టోయినిస్‌ (25), సీన్‌ అబాట్‌ (26), అస్టన్‌ అగర్‌ (17), స్టార్క్‌ (10), జంపా (10 నాటౌట్‌) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక భారీ స్కోర్లు చేయలేకపోయారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌.. అలెక్స్‌ క్యారీని క్లీన్‌బౌల్డ్‌ చేసిన విధానం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తొలి బంతి నుంచే గింగిరాలు తిరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్‌.. 39వ ఓవర్‌ తొలి బంతికి స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ పునాడా అని డౌట్‌ వచ్చేలా బంతిని మెలికలు తిప్పి క్యారీని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బంతి అంతలా టర్న్‌ అవుతుందని ఊహించని క్యారీ, బౌల్డ్‌ అయ్యాక పెట్టిన ఎక్స్‌ప్రెషన్‌ ప్రస్తుతం వైరలవతోంది.

వాస్తవానికి కుల్దీప్‌ ​కూడా ఆ బంతి అంతలా టర్న్‌ అవుతుందని ఊహించి ఉండడు. లెగ్‌ స్టంప్‌ అవల పడ్డ బంతి ఏకంగా హాఫ్‌ స్టంప్‌ను గిరాటు వేయడంతో బ్యాటర్‌తో పాటు మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. ఈ తరహా బంతులు ఎక్కువగా లెజెండరీ షేన్‌ వార్న్‌ వేయడం చూశాం. తాజాగా కుల్దీప్‌ అలాంటి బంతి వేయడంతో ఇతనికి షేన్‌ వార్న్‌ ఏమైనా పూనాడా అని నెటిజన్లు అనుకుంటున్నారు. కుల్దీప్‌ కూడా మంచి టర్నరే అయినప్పటికీ, బంతి ఇంతలా టర్న్‌ అయిన దాఖలాలు లేవు. కుల్దీప్‌ మ్యాజిక్‌ డెలివరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top