ప్రతి జట్టులో నలుగురు ఆఫ్ఘన్‌ ప్లేయర్లు తప్పనిసరి..! | ILT20 mandates 4 Afghanistan, 1 Irish player in every squad | Sakshi
Sakshi News home page

ప్రతి జట్టులో నలుగురు ఆఫ్ఘన్‌ ప్లేయర్లు తప్పనిసరి..!

Jun 4 2026 2:30 PM | Updated on Jun 4 2026 2:35 PM

ILT20 mandates 4 Afghanistan, 1 Irish player in every squad

యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ILT20) సీజన్‌-5కు ముందు నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో కనీసం నలుగురు ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్లను, ఓ ఐర్లాండ్‌ ఆటగాడిని తప్పనిసరిగా చేర్చుకోవాలని నియమం విధించారు. 

ఈ ఐదుగురు ఆటగాళ్లు జట్టులో ఉండాల్సిన కనీస 11 మంది ఫుల్‌ మెంబర్‌ దేశాల ఆటగాళ్ల కోటాలో (ఓవర్సీస్‌) భాగంగా పరిగణించబడతారు. 

ఈ ఏడాది నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 20 వరకు జరిగే సీజన్‌-5 కోసం విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ప్రతి జట్టులో 21 నుంచి 23 మంది ఆటగాళ్లు ఉండాలి. అందులో కనీసం 11 మంది ఫుల్‌ మెంబర్‌ దేశాల ఆటగాళ్లు, నలుగురు యూఏఈ ఆటగాళ్లు (ఒక క్యాప్డ్‌, ఒక అండర్‌-23 తప్పనిసరి), ఇద్దరు జీసీసీ దేశాల ఆటగాళ్లు (ఒకరు సౌదీ అరేబియా, మరొకరు కువైట్‌ నుంచి), అలాగే మరో అసోసియేట్‌ దేశానికి చెందిన ఆటగాడు ఉండాలి.

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నలుగురు, ఐర్లాండ్‌కు చెందిన ఒకరు, యూఏఈకి చెందిన నలుగురు, జీసీసీ దేశాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను "మ్యాండేటరీ ప్లేయర్స్‌"గా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నిబంధన వెనుక అసలు కారణాన్ని ILT20 వెల్లడించకపోయినా.. ఇది ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు, ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, క్రికెట్‌ ఐర్లాండ్‌ మధ్య ఉన్న అవగాహన ఒప్పందానికి సంబంధించినదిగా భావిస్తున్నారు.

అదే సమయంలో ప్రతి ఫ్రాంచైజీకి గరిష్ఠ వేతన పరిమితిని 20 లక్షల అమెరికన్‌ డాలర్లుగా నిర్ణయించారు. కనీసం 15 లక్షల డాలర్లు ఆటగాళ్లపై ఖర్చు చేయడం తప్పనిసరి. ఒక్కో ఆటగాడికి కనీస వేతనం 10 వేల డాలర్లు ఉండగా, గరిష్ఠ వేతనానికి మాత్రం ఎలాంటి పరిమితి లేదు. అదనంగా ఒక ‘వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌’ను జట్టులో చేర్చుకునే అవకాశం కూడా కల్పించారు.

ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్‌రైడర్స్‌, డెజర్ట్‌ వైపర్స్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌, షార్జా వారియర్స్‌, గల్ఫ్‌ జెయింట్స్‌ ఈ టోర్నీలో పాల్గొనే ఆరు జట్లు. గత సీజన్‌లో డెజర్ట్‌ వైపర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement