IND Vs WI Test Series 2023: I Was Not Expecting This Call Navdeep Saini On Return To Team India - Sakshi
Sakshi News home page

నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడెప్పుడో ఆసీస్‌తో! ఈసారి తుది జట్టులో చోటు ఖాయం!

Published Sat, Jun 24 2023 6:42 PM

I Was Not Expecting This Call Navdeep Saini On Return To Team India - Sakshi

India West Indies tour 2023: టీమిండియాకు తిరిగి ఎంపికవుతావని అస్సలు ఊహించలేదని ఢిల్లీ పేసర్‌ నవదీప్‌ సైనీ అన్నాడు. రెండోసారి వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుండటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. గతంలో తనకు తుది జట్టులో చోటు దక్కలేదని, ఈసారి మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నాడు. 

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో అరంగేట్రం
కాగా హర్యానాలోని కర్ణాల్‌లో జన్మించిన నవదీప్‌ సైనీ.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు జనవరిలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2021 సందర్భంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక శ్రీలంకతో 2021లో ఆడిన టీ20 మ్యాచ్‌ టీమిండియా తరఫున నవదీప్‌నకు ఆఖరి మ్యాచ్‌.

కౌంటీల్లో ఆడేందుకు
ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా సెలక్టర్ల నుంచి నవదీప్‌ సైనీ పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమైన అతడు అనూహ్య రీతిలో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కాగా వార్సెస్టర్‌షైర్‌ కౌంటీ క్లబ్‌కు ఆడాల్సిన సైనీ.. వెస్టిండీస్‌తో సిరీస్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేయనుండటంపై స్పందిస్తూ నవదీప్‌ సైనీ ఉద్వేగానికి లోనయ్యాడు.

అస్సలు ఊహించలేదు
‘‘నేను కౌంటీ క్రికెట్‌ ఆడేందకు లండన్‌కు వచ్చాను. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలోనే నేను వెస్టిండీస్‌లో పర్యటించే జట్టుకు ఎంపికయ్యానన్న వార్త తెలిసింది. నిజాయితీగా చెప్పాలంటే... నేను ఇది అస్సలు ఊహించలేదు.

ఐపీఎల్‌ ఆడుతున్న సమయంలో డ్యూక్‌ బాల్స్‌తో ప్రాక్టీస్‌ చేశా. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో నన్ను కనీసం స్టాండ్‌బై ఎంపిక చేస్తారనే ఆశతోనే అలా చేశా. కానీ అది జరుగలేదు. ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా మళ్లీ జట్టుతో చేరబోతున్నా’’ అని లండన్‌లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనీ పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌ పిచ్‌లపై తనకు అవగాహన ఉందన్న ఈ ఫాస్ట్‌ బౌలర్‌.. వెస్టిండీస్‌ పర్యటనకు ముందు ఒక్క మ్యాచ్‌ ఆడినా కావాల్సినంత ప్రాక్టీస్‌ దొరుకుతుందన్నాడు. కాగా 30 ఏళ్ల నవదీప్‌ సైనీ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టీ20లు ఆడి వరుసగా.. 2, 6, 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌-2023లో అతడు రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహించిన విషయం తెలిసిందే.

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ. 

చదవండి: లెజండరీ ఓపెనర్‌ దిల్షాన్‌.. డీకే మాదిరే! ఉపుల్‌ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ

Advertisement
Advertisement